“మతం ఆధారంగా రాజ్యాంగ హక్కులను కోల్పోవడం సముచితం కాదు”- మహా పూజ్య జయరావు పొలిమేర
“మతం ఆధారంగా రాజ్యాంగ హక్కులను కోల్పోవడం సముచితం కాదు”- మహా పూజ్య జయరావు పొలిమేర గారు
మతం ఆధారంగా ఎవరి రాజ్యాంగ హక్కులను కోల్పోయేలా చేయడం సముచితం కాదు అని, దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు ఎస్సీ హోదా కల్పించాలని అని కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (CBCI) ఎస్సీ/బీసీ విభాగం చైర్మన్, ఏలూరు పీఠాధిపతి మహా పూజ్య జయరావు పొలిమేర గారు పిలుపునిచ్చారు.
1950 ఆగస్టు 10న రాష్ట్రపతి జారీ చేసిన రాజ్యాంగ ఉత్తర్వులోని పేరా 3 ప్రకారం, కేవలం మతం ప్రాతిపదికన దళిత క్రైస్తవులు మరియు దళిత ముస్లింలను ఎస్సీ జాబితా నుండి మినహాయించడం తీవ్ర వివక్షతో కూడుకున్నదని మహా పూజ్య జయరావు పొలిమేర గారు పేర్కొన్నారు.
మనుషుల గౌరవాన్ని పెంపొందించడానికే మతం ఉపయోగపడాలని, రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు ఏ పౌరుడికి కూడా మతం పేరిట నిరాకరించబడకూడదని ఆయన స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం పౌరులందరికీ సమాన హక్కులు, సమాన గౌరవం మరియు చట్టపరమైన రక్షణ పొందడానికి అర్హత ఉందన్నారు.
మహా పూజ్య జయరావు పొలిమేర గారి పిలుపు మేరకు ఆగస్టు 10న తెలుగు రాష్ట్రాలలో వివిధ మేత్రాసనాలు, విచారణలు, ధార్మిక సంస్థల్లో ప్రత్యేక ప్రార్థనలు, అవగాహన సదస్సులు మరియు శాంతియుత ర్యాలీలు నిర్వహించారు.
స్థానిక ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతిపత్రాలు అందజేయాలి అని , ఈ వినతిపత్రాలను గౌరవనీయులైన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి, మరియు గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి చేరవేసేలా ప్రజాప్రతినిధులను అభ్యర్థించాలి అని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం, దేశంలోని ప్రజాప్రతినిధులు మరియు నాయకులు కరుణతో స్పందించి దళిత క్రైస్తవులు, దళిత ముస్లింల దశాబ్దాల నాటి న్యాయబద్ధమైన కోరికను తీర్చాలని, వారి ఎస్సీ హక్కులను పునరుద్ధరించాలని కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (CBCI) ఎస్సీ/బీసీ విభాగం చైర్మన్, ఏలూరు పీఠాధిపతి మహా పూజ్య జయరావు పొలిమేర గారు విజ్ఞప్తి చేశారు.
ప్రతి సంవత్సరం దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (CBCI), నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చ్స్ ఇన్ ఇండియా మరియు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ దళిత క్రిస్టియన్స్ ఆగస్టు 10వ తేదీని “బ్లాక్ డే”గా నిర్వహిస్తాయి.
*Source : catholic connect
Article and Design By M Kranthi Swaroop
