విజయవాడ మేత్రాసనంలో క్రైస్తవ ఐక్యత, మతాంతర సంభాషణపై ప్రత్యేక సదస్సు
క్రైస్తవ ఐక్యతను బలోపేతం చేయడం, వివిధ మతాలకు చెందిన ప్రజల మధ్య పరస్పర అవగాహన, గౌరవం, సామరస్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా విజయవాడలో ప్రత్యేక సదస్సు నిర్వహించారు.
దైవప్రజలకు క్రైస్తవ ఐక్యత, మతాంతర సంభాషణల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు కొనసాగుతున్న కార్యక్రమాలలో భాగంగా, TCBC తెలుగు కతోలిక పీఠాధిపతుల సమాఖ్య (టిసిబిసి) క్రైస్తవ సమైక్యతా విభాగం , CCBI (కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా) క్రైస్తవ సమైక్యతా విభాగం వారి సహకారంతో నవంబర్ 4వ తేదీన విజయవాడ బిషప్ హౌస్ నందు ఒకరోజు సదస్సును నిర్వహించింది.
శ్రీసభ పరిచర్యలో అంతర్భాగాలుగా క్రైస్తవ ఐక్యత, మతాంతర సంభాషణలు అనే అంశంపై జరిగిన ఈ సదస్సులో సుమారు 95 మంది పాల్గొన్నారు. వీరిలో పీఠాధిపతులు, గురువులు, కన్యస్త్రీలు పాల్గొన్నారు.
గురుశ్రీ వర్గీస్ మరియు సిస్టర్ రేజుల ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం విజయవాడ మేత్రాసన వికార్ జనరల్ గురుశ్రీ ఎం. ప్రసాద్ స్వాగత ప్రసంగం చేశారు. TCBC కమిషన్ ఉప కార్యదర్శి గురుశ్రీ రాజు అలెక్స్, ముఖ్య వక్త గురుశ్రీ డా. విన్సెంట్ శేఖర్, SJను సభకు పరిచయం చేసి స్వాగతించారు.
తన ప్రసంగాలలో గురుశ్రీ డా. విన్సెంట్ శేఖర్, ఇతర క్రైస్తవ సంఘాలతో పాటు వివిధ మత సంప్రదాయాలకు చెందిన ప్రజలతో శ్రీసభకు ఉన్న సంబంధాల చారిత్రక, ఆచరణాత్మక అంశాలను వివరించారు.
సమాజంలోని క్షేత్రస్థాయిలో పరస్పర అవగాహనను పెంపొందించడం, సామరస్యపూర్వక సంబంధాలను నిర్మించుకోవడం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.
ఆయన ప్రసంగాల అనంతరం జరిగిన చర్చల్లో పాల్గొన్నవారు పలు ప్రశ్నలు అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
ఈ సందర్భంగా నెల్లూరు మేత్రాసన సహ వారస పీఠాధిపతి, TCBC క్రైస్తవ సమైక్యతా విభాగం అధ్యక్షులు మహా పూజ్య డా. ఆంథోనీ దాస్ పిల్లి మాట్లాడుతూ, ఇతరులను గౌరవించడం, అందరినీ సమాన భావంతో చూడడం, సమస్త మానవాళి సంక్షేమం కోసం కలిసికట్టుగా పనిచేయడం ఎంతో ముఖ్యమని అన్నారు.
విజయవాడ మేత్రాసన పీఠాధిపతి మహా పూజ్య డా. టి. జోసఫ్ రాజారావు, S.M.M., క్రైస్తవ ఐక్యత ఆవశ్యకతను తెలియచేసారు. మేత్రాసన స్థాయిలో వివిధ క్రైస్తవ సంఘాలతో కలిసి ఉమ్మడి ఐక్యతా కార్యక్రమాలను నిర్వహించాలని ప్రోత్సహించారు. అలాగే ఇతర మత సంప్రదాయాలకు చెందిన ప్రజలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటూ, వాటిని విస్తరించాల్సిన అవసరాన్ని వివరించారు.
CCBI క్రైస్తవ సమైక్యతా విభాగం కార్యదర్శి గురుశ్రీ కె. అంతయ్య మాట్లాడుతూ, ఈ సదస్సును నిర్వహించేందుకు సహకరించిన విజయవాడ మేత్రాసనానికి కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ మేత్రాసనంలోనే కాకుండా తెలుగు ప్రాంతమంతటా క్రైస్తవ ఐక్యత, మతాంతర సంభాషణలను ప్రోత్సహించేందుకు చేస్తున్న కృషిని అభినందించారు.
ఈ సదస్సు.... పాల్గొన్నవారికి పరస్పర ఆలోచనలు పంచుకోవడానికి, అనుభవాలను తెలుసుకోవడానికి, నూతన నిబద్ధతతో ముందుకు సాగడానికి విలువైన అవకాశాన్ని కల్పించింది. క్రైస్తవ ఐక్యత, మతాంతర సంభాషణలు శ్రీసభ పరిచర్యలో అంతర్భాగాలుగా మారి, సమాజంలో ఐక్యత, అవగాహన, శాంతియుత సహజీవనాన్ని పెంపొందించాలనే పిలుపుతో సదస్సు ముగిసింది.
