ఇక సెలవు.. ముగిసిన మల్లవరపు ప్రకాష్ గారి అంత్యక్రియలు

విశాఖ అతిమేత్రాసన విశ్రాంత అగ్రపీఠాధిపతులు, తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కాపరి మహా పూజ్య. మల్లవరపు ప్రకాష్ (77) గారి అంత్యక్రియలు ఈరోజు అనగా జూన్11,2026 న ఘనంగా నిర్వహించారు.

విశాఖపట్నం, జ్ఞానాపురం లోని పునీత పేతురు ప్రధాన దేవాలయం (St. Peter's Cathedral) లో మహా పూజ్య డాక్టర్ మల్లవరపు ప్రకాష్ గారి భూస్థాపన కార్యక్రమం గురువారం ఉదయం 10 గంటలకు నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కార్డినల్ మహా పూజ్య పూల ఆంథోనీ గారు మరియు అధిక సంఖ్యలో వివిధ పీఠాధిపతులు ,గురువులు, సిస్టర్స్ ,విశ్వాసులు పాల్గొన్నారు.

విశాఖ అగ్రపీఠాధిపతులు మహా పూజ్య ఉడుముల బాల గారు , ఏలూరు పీఠాధిపతులు మహా పూజ్య పొలిమేర జయరావు గారు, విజయవాడ పీఠాధిపతులు డాక్టర్ తెలగతోటి జోసఫ్ రాజారావు మరియు ఇతర పీఠాధిపతులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి, ఆయన సేవలను కొనియాడారు.

ఉదయం 6 గంటల నుండి ప్రజల సందర్శనార్థం పార్థివదేహాన్ని పునీత అంతోనీ వారి దేవాలయంలో ఉంచారు. విచారణకర్తలు ఫాదర్ పరంజ్యోతి గారు ప్రత్యేక దివ్యబలి పూజను సమర్పించారు. ప్రజల సందర్శనార్థం అనంతరం పునీత పేతురు దేవాలయానికి అంతిమయాత్ర గా బైక్ ర్యాలీ నిర్వహించారు. మహారాణిపేట నుంచి జ్ఞానాపురం వరకు వేలాది మంది విశ్వాసులు , సిస్టర్స్ , ర్యాలీగా తరలివచ్చారు.

పునీత పేతురు ప్రధాన దేవాలయంలో దివ్యబలి పూజ అనంతరం కతోలిక సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. దేవాలయంలోనే భూస్థాపన కార్యాక్రమాన్ని నిర్వహించారు.

మహా పూజ్య మల్లవరపు ప్రకాష్ గారి జీవితం విశ్వాసం, వినయం, మరియు ప్రేమతో కూడిన సేవా జీవితానికి సజీవ సాక్ష్యం.

ఆయన చూపిన విశ్వాస మార్గం, వినయపూర్వక సేవా భావం, అందరిపట్ల చూపిన ప్రేమ నేటికీ విశ్వాసులను ప్రేరేపిస్తూనే ఉన్నాయి.

"ప్రజల మధ్య జీవించిన నిజమైన కాపరిగా ఆయన ఎప్పటికీ విశ్వాసుల గుండెల్లో ఉండిపోతారు "...

By M Kranthi Swaroop

Telugu Survey Popup Image