సత్యమేదో వివేచించే సామర్థ్యమే మన ముందున్న సవాలు: FABC సినడాలిటీ అధికారి
కృత్రిమ మేధస్సు యుగంలో మనిషి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు, సత్యాన్ని అసత్యం నుంచి వివేచించే సామర్థ్యమని Federation of Asian Bishops' Conferences (FABC) అసోసియేట్ ప్రధాన కార్యదర్శి, Office of Synodality కార్యనిర్వాహక కార్యదర్శి గురుశ్రీ క్లారెన్స్ దేవదాస్ అన్నారు. FABC 12వ ప్లీనరీ సమావేశం ముగింపు విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జూలై 26న ఇండోనేషియాలోని జకార్తాలో మరియ మాత స్వర్గారోహణ బృహద్దేవాలయం సేవా కేంద్రంలో మాట్లాడుతూ, శ్రీసభ కృత్రిమ మేధస్సును విలువైన సాధనంగా స్వీకరించాల్సిన అవసరం ఉందని, అదే సమయంలో వివేచన, సువార్త విలువల్లో దృఢంగా పాతుకుపోయి ఉండాలని గురుశ్రీ దేవదాస్ అన్నారు.
ప్రతినిధులు జకార్తాలోని ఫ్రెండ్షిప్ టన్నెల్ గుండా సమీపంలోని ఇస్తిక్లాల్ మసీదు వరకు ప్రతీకాత్మక తీర్థయాత్ర పూర్తి చేసిన అనంతరం నిర్వహించిన ఈ తుది విలేకరుల సమావేశంలో FABC ఉపాధ్యక్షుడు కార్డినల్ పాబ్లో వర్జిలియో డేవిడ్, ఇండోనేషియా కతోలిక పీఠాధిపతుల సమాఖ్య అధ్యక్షుడు పీఠాధిపతి ఆంటోనియస్ సుబియాంటో బుంజామిన్ కూడా పాల్గొన్నారు.
శ్రీసభలో కృత్రిమ మేధస్సు పెరుగుతున్న పాత్రపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా, సాంకేతిక పురోగతికి శ్రీసభ వ్యతిరేకం కాదని గురుశ్రీ దేవదాస్ స్పష్టం చేశారు.
"కృత్రిమ మేధస్సు ఒక సాధనం మాత్రమే," అని ఆయన పేర్కొంటూ, దాని నైతిక విలువ పూర్తిగా మనుషులు దానిని ఎలా వినియోగిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుందని అన్నారు.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో సాంకేతికత శ్రీసభ సేవకు ఎలా ఉపయోగపడిందో ఆయన ఉదాహరణగా వివరించారు. ఆ కాలంలో ప్రత్యక్ష ప్రసారమైన దివ్యబలిపూజల ద్వారా వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, బృహద్దేవాలయానికి ప్రత్యక్షంగా రాలేని కతోలికులు కూడా దివ్యబలిపూజలో, తమ విశ్వాస సమాజంతో అనుసంధానమై ఉండగలిగారని చెప్పారు.
ప్రపంచంలోనే అత్యధిక భాషా, సాంస్కృతిక వైవిధ్యం కలిగిన ప్రాంతాలలో ఒకటైన ఆసియాలో సమాచార వినిమయాన్ని బలోపేతం చేయడంలో కృత్రిమ మేధస్సుకు ఉన్న అవకాశాలను కూడా గురుశ్రీ దేవదాస్ ప్రస్తావించారు.
శ్రీసభ పత్రాలను అనేక ఆసియా భాషల్లోకి అనువదించడం ద్వారా సేవాపర వనరులు, అధికారిక బోధనలు ఖండవ్యాప్తంగా స్థానిక శ్రీసభలకు మరింత సులభంగా అందుబాటులోకి రావడానికి కృత్రిమ మేధస్సు దోహదపడగలదని ఆయన అన్నారు.
అయితే ఈ ప్రయోజనాల మధ్య, డిజిటల్ యుగం కేవలం సమాచార నిర్వహణ కంటే ఎంతో పెద్ద సవాలును తీసుకొచ్చిందని ఆయన హెచ్చరించారు.
"నేడు మన సమస్య సమాచారం లేకపోవడం కాదు. సత్యమేదో వివేచించే సామర్థ్యం లేకపోవడమే," అని గురుశ్రీ దేవదాస్ అన్నారు.
డిజిటల్ సాంకేతికతల ద్వారా సమాచారం, తప్పుడు సమాచారం రెండూ క్షణాల్లో సృష్టించబడి వ్యాప్తి చెందుతున్న ఈ కాలంలో, వివేచన ప్రతి క్రైస్తవునికి అత్యంత అవసరమైన సుగుణంగా మారిందని ఆయన నొక్కిచెప్పారు.
కృత్రిమ మేధస్సు రూపొందించిన ప్రతి సమాచారాన్ని యథాతథంగా స్వీకరించకుండా, అది సత్యమైనదా, నిర్మాణాత్మకమైనదా, మానవ గౌరవాన్ని గౌరవిస్తున్నదా అనే విషయాలను కతోలికులు పరిశీలించాలని ఆయన సూచించారు.
గురుశ్రీ దేవదాస్ వ్యాఖ్యలు, కృత్రిమ మేధస్సును ముప్పుగా కాకుండా, నైతిక బాధ్యతతో మానవాళి సేవ కోసం వినియోగించినప్పుడు అది ఒక అవకాశంగా మారుతుందని విలేకరులకు చెప్పిన కార్డినల్ పాబ్లో వర్జిలియో డేవిడ్ అభిప్రాయాలకు పరిపూరకంగా నిలిచాయి.
ఈ ఇద్దరి వ్యాఖ్యలు FABC ప్లీనరీ సమావేశంలోని ప్రధాన సందేశాలలో ఒకదాన్ని ప్రతిబింబించాయి. అదేంటంటే, ఆసియాలోని శ్రీసభ అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలతో ధైర్యంగా మమేకమవుతూ, అవి సువార్త విలువలు, మానవ గౌరవం, అలాగే ఆలకింపు, సంభాషణ, ఉమ్మడి వివేచన అనే సినడల్ ఆచరణలో పాతుకుపోయేలా చూసుకోవాలి.
గురుశ్రీ దేవదాస్ అభిప్రాయం ప్రకారం, కృత్రిమ మేధస్సు భవిష్యత్తు కేవలం సాంకేతిక ఆవిష్కరణల గురించి మాత్రమే కాదు; వివేకంతో, నైతిక బాధ్యతతో నిర్ణయాలు తీసుకోగల వ్యక్తులను తీర్చిదిద్దడం గురించీ కూడా.
కృత్రిమ మేధస్సు నిత్యజీవితంలో మరింత భాగమవుతున్న ఈ కాలంలో, కొత్త సాంకేతికతలను స్వీకరించడం మాత్రమే కాకుండా, సత్యాన్ని అసత్యం నుంచి వివేచించేందుకు ప్రజలకు తోడ్పడడం, మానవ గౌరవాన్ని పెంపొందించడం, సాంకేతికత సమస్త ప్రజల మేలు కోసం ఉపయోగపడేలా చూడడం కూడా శ్రీసభ బాధ్యత అని ఆయన అన్నారు.
