పవిత్ర అవశేషాలు ను పూజిస్తున్నారా? క్యాథలిక్ విశ్వాసం ఏం చెబుతోంది?
పవిత్ర అవశేషాలు ను పూజిస్తున్నారా? క్యాథలిక్ విశ్వాసం ఏం చెబుతోంది?
క్యాథలిక్ ధర్మశాస్త్రం ప్రకారం, విశ్వాసులు పవిత్ర అవశేషాలను దేవుడిగా భావించి పూజించరు. మన ప్రభువైన యేసుక్రీస్తు మార్గంలో నడుస్తూ , దేవుని కోసం ప్రాణాలను అర్పించిన పవిత్ర వ్యక్తి యొక్క అవశేషంగా గౌరవిస్తారు. ఇది దేవునికి చేసే ఆరాధన (Worship) కాదు. దేవుని కొరకు ప్రాణత్యాగం చేసిన వ్యక్తికి చూపించే గౌరవం (Veneration) మాత్రమే.
క్యాథలిక్ సంప్రదాయంలో, పవిత్ర అవశేషాలు అంటే పుణ్యాత్ముల భౌతిక దేహాలు లేదా వ్యక్తిగత వస్తువులు, లేదా మన ప్రభువైన యేసు క్రీస్తుతో సంబంధం ఉన్న వస్తువులు.
ఈ రోజుల్లో దేవుని మార్గంలో నడుస్తూ, విశ్వాసులను ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తున్న ఫాదర్లను, పాస్టర్లను మనం గౌరవిస్తాం. వారు కనపడగానే పరిగెత్తుకుంటూ వెళ్లి ప్రార్ధించమని అడుగుతాము. అలానే వారి పట్ల మన ప్రేమను, కృతజ్ఞతను వివిధ రకాలుగా చుపిస్తాము .
అలాగే, మన మధ్య లేకపోయినా దేవుని కోసం జీవించి, విశ్వాసం కోసం తమ ప్రాణాలను అర్పించిన పునీతులను కూడా మనం గౌరవిస్తాం. వారి విగ్రహాలను లేదా స్వరూపాలను మన భుజాలపై మోస్తూ, “వారు మన ప్రభువైన యేసు క్రీస్తు కోసం ఎలా నిలబడ్డారో పదిమందికి తెలియజేస్తాము".
పునీతుల స్వరూపాలను గౌరవించడం, లేదా వారి పవిత్ర అవశేషాలకు గౌరవం చూపించడం దేవుని స్థానంలో వారిని పెట్టడం కాదు. దేవుని కోసం వారు జీవించిన జీవితాన్ని గుర్తుచేసుకుంటూ, మన విశ్వాసాన్ని మరింత బలపరుచుకోవడమే.
బైబిల్ లో కొన్ని సంఘటనలను ఉదాహరణగా చూస్తే …2 రాజులు 13:21, లో “ఒక వ్యక్తి చనిపోయిన తరువాత అతని శరీరాన్ని ఎలీషా ప్రవక్త సమాధిలో పడేశారు. ఆ శరీరం ఎలీషా ఎముకలను తాకినప్పుడు అతడు తిరిగి బ్రతికాడు” అని బైబిల్ లో వ్రాసి ఉన్నది.
అలానే , అపొస్తలుల కార్యములు 19:11–12 లో చూసినట్లయితే...” పౌలు శరీరాన్ని తాకిన వస్త్రాలను(చేతిగుడ్డలనైనను, నడుమునకు కట్టుకొను వస్త్రములనైనను) తీసుకెళ్లినప్పుడు రోగులు స్వస్థత పొందినట్లు , అలాగే అపవిత్రాత్మలు వారిని విడిచిపోయెను” అని బైబిల్ లో వ్రాసి ఉన్నది.
“దేవుడు భౌతిక వస్తువుల ద్వారా కూడా తన కృపను వ్యక్తపరచగలడు. కానీ ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి ... శక్తి ఆ వస్తువులో లేదు… వస్తువు కేవలం ఒక సాధనం మాత్రమే. ఆ శక్తి సంపూర్ణంగా దేవునిదే!!
స్వస్థపరిచేది దేవుడే!
కృపను ప్రసాదించేది దేవుడే!
అద్భుతాన్ని చేసేది దేవుడే!
కాబట్టి మన విశ్వాసం పుర్రెలో కాదు… అవశేషాల్లో కాదు… విగ్రహంలో కాదు… మన విశ్వాసం సజీవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తులోనే!!
Article and Design BY M Kranthi Swaroop
