“ప్రతి జీవితం అమూల్యం” | చెన్నైలో ఘనంగా "జీవిత పరిరక్షణ కోసం పాదయాత్ర"
“ప్రతి జీవితం అమూల్యం” | చెన్నైలో ఘనంగా "జీవిత పరిరక్షణ కోసం పాదయాత్ర"
"5వ జాతీయ మార్చ్ ఫర్ లైఫ్ (March for Life) "ను ఆగష్టు 9 ఆదివారం నాడు చెన్నైలోని స్టెల్లా మేరీస్ కళాశాలలో ఘనంగా నిర్వహించబడింది.
ప్రతి మానవ జీవితం యొక్క గౌరవం, విలువ మరియు రక్షణకు మద్దతుగా మనమంతా ఒక్కటై ముందుకు సాగుదాం అనే నినాదం తో ఈ మార్చ్ ఫర్ లైఫ్ (March for Life) నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (CBCI) యొక్క అనుబంధ సంస్థ అయిన చారిస్ ఇండియా నిర్వహించగా, మద్రాస్-మైలాపూర్ ఆర్చిడియోసెస్ ఆతిథ్యం ఇచ్చింది.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విశ్వాసులు, కుటుంబాలు, యువత, మతపెద్దలు, జీవితం పట్ల గౌరవాన్ని చాటే కార్యకర్తలు మరియు వివిధ వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి మానవ జీవితానికి మద్దతుగా తమ స్వరాన్ని వినిపించారు.
ఈ కార్యక్రమంలో మహా పూజ్య ఫ్రాన్సిస్ కలిస్ట్ గారు , CCBI అధ్యక్షులు మహా పూజ్య కార్డినల్ ఆంథోనీ పూల గారు, దైవజనులు డా. పాల్ దినకరన్ ఇతరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మద్రాస్–మైలాపూర్ అగ్రపీఠాధిపతులు మహా పూజ్య డా. జార్జ్ ఆంటోనిసామి గారి అధ్యక్షతన పవిత్రమైన దివ్యబలి పూజ జరిగింది. దివ్యబలి అనంతరం జీవిత పరిరక్షణకు తమ మద్దతును తెలియజేస్తూ, ఐక్యతతో మార్చ్ ఫర్ లైఫ్ లో పాల్గొని ముందుకు సాగారు.
అనంతరం సోదరభావం, ప్రేరణాత్మక సందేశాలు, ప్రార్థనలు, సంగీతం మరియు ఆత్మీయ కలయికతో కూడిన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
CCBI ఫ్యామిలీ కమిషన్ ప్రో-లైఫ్ మినిస్ట్రీ అసోసియేట్ సెక్రటరీ శ్రీ అజిన్ జోసెఫ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రో-లైఫ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. మన తెలుగు రాష్ట్రాల నుండి సుమారు 30 మంది యువత జాతీయ మార్చ్ ఫర్ లైఫ్ (జీవన పరిరక్షణ మార్చ్)లో పాల్గొన్నారు. జాతీయ యువత కోఆర్డినేటర్ మెరుగు ప్రశాంత్, రీజినల్ యూత్ అడ్వైజర్ హ్యారీ జాషువా, మాథ్యూ, ఉదయ్, కృష్ణకర్ ఇతరులు పాల్గొన్నారు.
"ఈ కార్యక్రమం కేవలం ఒక ర్యాలీగా కాకుండా, జీవితం యొక్క పవిత్రత, మానవ గౌరవం, కుటుంబ విలువలు మరియు సమాజంలో ప్రతి వ్యక్తి పట్ల బాధ్యత గురించి అవగాహన కల్పించే ఒక ఆత్మీయ మరియు సామాజిక కార్యక్రమంగా కొనసాగింది" అని జాతీయ యువత కోఆర్డినేటర్ "శ్రీ మెరుగు ప్రశాంత్" గారు తెలిపారు.
Article and Design BY M Kranthi Swaroop
