'లౌదాతో సి' వారాన్ని పచ్చదనంతో ప్రారంభించిన బంగ్లాదేశ్ డయోసెస్

'లౌదాతో  సి' వారాన్ని పచ్చదనంతో ప్రారంభించిన బంగ్లాదేశ్ డయోసెస్

బంగ్లాదేశ్‌లోని రాజ్‌షాహి డియోసెస్, పర్యావరణ బాధ్యత మరియు సృష్టి పట్ల శ్రద్ధను చాటిచెప్పే విధంగా, మే 17న గుడ్ షెపర్డ్ కేథడ్రల్ పారిష్‌లో మొక్కలు నాటే కార్యక్రమంతో 'లౌడాటో సి' వారాన్ని ప్రారంభించింది.

ఈ కార్యక్రమంలో 300 మందికి పైగా విచారణ విశ్వాసుల  సమక్షంలో జరిగింది. పవిత్ర దివ్య సత్ప్రసాదం మరియు ప్రత్యేక ప్రార్థనలతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో విచారణ గురువులు ఫాదర్ బిశ్వనాథ్ ఫౌస్టినో మారండీ గారు మరియు  కేథడ్రల్ పారిష్ పాస్టోరల్ కౌన్సిల్ సభ్యులు, వివిధ సంఘాలకు చెందిన 15 మంది  సిస్టర్స్  మరియు 11 మంది సెమినారియన్లు పాల్గొన్నారు.

దివ్యబలి పూజ సమర్పించిన  ఫాదర్ మారండీ గారు  యేసు ఆరోహణ పండుగను సృష్టి సంరక్షణ పట్ల క్రైస్తవుల బాధ్యతతో అనుసంధానించారు.

2015లో పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ గారు జారీ చేసిన పర్యావరణ ఎన్సైక్లికల్ అయిన 'లౌదాతో  సి' యొక్క ప్రాముఖ్యతను గురించి ప్రస్తావిస్తూ, విశ్వాసులలో మరింత లోతైన పర్యావరణ అవగాహన మరియు బాధ్యతను శ్రీసభ ప్రోత్సహిస్తూనే ఉందని ఫాదర్ మారండి గారు అన్నారు.

మే 17 నుండి 24 వరకు జరిగే 'లౌడాటో సి' వారోత్సవాల ఆచరణ, సృష్టిని పరిరక్షించడం మరియు సుస్థిర జీవనాన్ని ప్రోత్సహించడం పట్ల చర్చి యొక్క నిబద్ధతను పునరుద్ధరించడమే లక్ష్యంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

"మనం సృష్టిని సంరక్షించుకోవాలి, మరిన్ని చెట్లు నాటాలి, పర్యావరణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలి," అని ఆయన అన్నారు. "ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత, దానిని సంరక్షించే బాధ్యతను దేవుడు మానవాళికి అప్పగించాడు అని ఫాదర్ మారండి గారు అన్నారు.

పర్యావరణ పరిరక్షణను కేవలం సామాజిక బాధ్యతగానే కాకుండా, క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో ఒక భాగంగా కూడా గుర్తించేలా ఈ కార్యక్రమం ప్రజలను ప్రోత్సహించిందని కార్యక్రమంలో  పాల్గొనే ఒక వ్యక్తి అన్నారు.

Article and design by M kratnhi swaroop