ఫిలిప్పీన్స్: దివ్య కరుణ ఆదివారం రోజున RVA కేంద్ర కార్యాలయంలో “ముగ్గురు పునీతుల ప్రార్థనా మందిరం” ప్రారంభం

“ముగ్గురు పునీతుల ప్రార్థనా మందిరం” ప్రారంభం

ఫిలిప్పీన్స్: దివ్య కరుణ ఆదివారం రోజున  RVA కేంద్ర కార్యాలయంలో “ముగ్గురు పునీతుల ప్రార్థనా మందిరం” ప్రారంభం

ఫిలిప్పీన్స్‌లోని క్వీజాన్ సిటీలో ఉన్న రేడియో వెరితాస్ ఆసియా (RVA) కేంద్ర కార్యాలయంలో, ఏప్రిల్ 12న దివ్య కరుణ ఆదివారం సందర్భంగా నూతనంగా పునర్నిర్మించిన “ముగ్గురు పునీతుల ప్రార్థనా మందిరం” ఆశీర్వాదం చేసి ప్రారంభించారు. ఈ సందర్భానికి 200 మందికి పైగా విశ్వాసులు హాజరై కృతజ్ఞతా బలి పూజలో పాల్గొన్నారు.

ఈ ప్రారంభోత్సవ వేడుకకు కుబావో మేత్రాసనానికి  చెందిన పీఠాధిపతి మహా పూజ్య ఎలియాస్ ఎల్. అయుబాన్ జూనియర్ అధ్యక్షత వహించారు. ఆయన ఫిలిప్పీన్స్ రేడియో ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (PREIC) ఉపాధ్యక్షుడిగాను పనిచేస్తున్నారు. PREIC సంస్థే రేడియో వెరితాస్ ఆసియాకు యజమాని.

ఈ బలి పూజలో జనరల్ మేనేజర్ గురుశ్రీ ఫెల్మార్ ఫియెల్ (SVD), ప్రోగ్రామ్ డైరెక్టర్ గురుశ్రీ జాన్ మీ షెన్, అలాగే RVA కేంద్ర కార్యాలయంలో సేవలందిస్తున్న ఇతర గురువులు సమిష్టిదివ్యబలిపూజలో పాల్గొన్నారు.

స్వాగత ప్రసంగంలో గురుశ్రీ ఫెల్మార్ ఫియెల్ మాట్లాడుతూ, ప్రార్థనా మందిరం పునర్నిర్మాణం పూర్తయినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది RVA సంస్థ స్థాపనకు 57 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుగుతోందని చెప్పారు.

“15 సంవత్సరాలకు పైగా గడిచిన తరువాత ఈ ప్రార్థనా మందిరం విశేషంగా పునరుద్ధరించబడింది. చిన్నపాటి మరమ్మత్తులతో మొదలైన పనులు, ఇప్పుడు పూర్తి మార్పుకు దారి తీసాయి—రంగులు వేయడం, కొత్త కార్పెట్, సిలువ మార్గం ఏర్పాటు, సదుపాయాల మెరుగుదల వంటి పనులు జరిగాయి” అని ఆయన తెలిపారు.

ఈ పునర్నిర్మాణం రోజువారీ బలి పూజకు సహకరించే దాతల ఉదారత వల్ల సాధ్యమైందని, వారి మద్దతు RVA యొక్క సువార్త ప్రచార సేవకు బలమైందని ఆయన గుర్తించారు.

ఆశీర్వాదం మరియు కరుణ సందేశం

మహా పూజ్య అయుబాన్ ప్రార్థనా మందిరాన్ని ఆశీర్వదిస్తూ, ఇది “అజ్ఞాతులు స్వాగతం పొందే స్థలం, తప్పిపోయినవారు కనుగొనబడే స్థలం, అలసినవారు విశ్రాంతి పొందే స్థలం” కావాలని దేవుని కృప కోరారు. అనంతరం పవిత్ర జలంతో ఆశీర్వదించారు.

తన బోధనలో దివ్య కరుణ విషయంపై మాట్లాడిన ఆయన, కరుణ అనేది దేవుడు ఇచ్చే ఒక గుణం మాత్రమే కాకుండా, దేవుని స్వభావమేనని చెప్పారు. పోప్ ఫ్రాన్సిస్ మాటలను ఉటంకిస్తూ, “దేవుడు మనలను క్షమించడంలో ఎప్పుడూ అలసిపోడు; క్షమాపణ కోరడంలో మనమే అలసిపోతాం” అని పేర్కొన్నారు.

పునరుత్థిత యేసును చూచిన అపొస్తలుడు తోమా సంఘటనను ఉదహరిస్తూ, యేసు గాయాలు తొలగిపోలేదు, కానీ అవి మహిమ సూచికలుగా మారాయని తెలిపారు.

“మీ గాయాలను చూసి సిగ్గుపడకండి. అవే దేవుని కృప ప్రవహించే మార్గాలు” అని విశ్వాసులకు బోధించారు.

ముగ్గురు పునీతులకు అంకితం

బోధన అనంతరం, ఈ ప్రార్థనా మందిరాన్ని అధికారికంగా “RVA ముగ్గురు పునీతుల ప్రార్థనా మందిరం”గా అంకితం చేశారు. ఇది ఆధునిక కతోలిక విశ్వాసానికి ప్రతీకలైన ముగ్గురు మహనీయులకు అంకితం చేయబడింది—పోప్ పాల్ VI, పోప్ జాన్ పాల్ II, మరియు మదర్ తెరిసా.

గురుశ్రీ  జాన్ మీ షెన్ మాట్లాడుతూ, ఈ ముగ్గురు పునీతులు RVA ను సందర్శించి, ఆధ్యాత్మిక వారసత్వాన్ని వదిలి వెళ్లారని వివరించారు.

“ఈ ముగ్గురు పునీతులకు అంకితం చేయడం ద్వారా, వారి ప్రార్థనా సహాయాన్ని కోరుతూ, వారి మిషనరీ ఉత్సాహం, క్రీస్తుపట్ల ప్రేమ, సువార్త ప్రచారంలో వారి నిబద్ధతను అనుసరించాలని కోరుకుంటున్నాం” అని ఆయన అన్నారు.

తదనంతరం, పోప్ జాన్ పాల్ II ధరించిన తలపాగా సహా మూడు పరిశుద్ధుల అవశేషాలను ఘనంగా ఊరేగింపుగా తీసుకువచ్చారు.

మహా పూజ్య అయుబాన్ ఆ అవశేషాలను స్వీకరించి, ప్రార్థనా మందిర గోడలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థలంలో ఉంచి, అధికారికంగా అంకితం చేశారు.

వేడుకలు మరియు భవిష్యత్ ప్రణాళికలు

బలి పూజ అనంతరం పాల్గొన్నవారికి భోజన విందు ఏర్పాటు చేశారు. RVA చరిత్ర మరియు ఆసియా వ్యాప్తంగా దాని సేవలపై ఒక చిన్న వీడియోను ప్రదర్శించారు. రోజువారీ బలి పూజకు హాజరయ్యే విశ్వాసులు మరియు సిబ్బంది తమ అనుభవాలను పంచుకున్నారు.

భవిష్యత్తు దిశగా, గురుశ్రీ జాన్ మీ షెన్ 2029లో జరగనున్న RVA 60వ వార్షికోత్సవానికి సిద్ధతలు ప్రారంభమయ్యాయని ప్రకటించారు. రాబోయే మూడు సంవత్సరాలను ఒక్కో పునీతునికి అంకితం చేస్తూ, RVA ప్రాంగణంలో “ముగ్గురు పునీతుల తోట” ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. అందులో వారి జీవితాలను ప్రతిబింబించే విగ్రహాలు మరియు సందేశాలు ఉంటాయి.

ఇప్పుడీ RVA ముగ్గురు పునీతుల ప్రార్థనా మందిరం, రేడియో వెరితాస్ ఆసియాకు ఆధ్యాత్మిక హృదయంగా నిలిచి, విశ్వాసం, మిషన్ మరియు విశ్వమండల చర్చితో ఏకత్వానికి చిహ్నంగా నిలుస్తోంది.