"వారధులను నిర్మించడం మా శ్రీసభ సహజ జీవన విధానం" – పాకిస్తాన్ కతోలిక పీఠాధిపతుల సమాఖ్య అధ్యక్షుడు పీఠకాపరి సామ్సన్ షుకార్డిన్

పాకిస్తాన్ కతోలిక పీఠాధిపతుల సమాఖ్య అధ్యక్షుడు పీఠకాపరి సామ్సన్ షుకార్డిన్
మత స్వేచ్ఛ, మానవ హక్కులు, సామాజిక న్యాయం కోసం అలుపెరుగని స్వరంగా నిలిచిన పీఠకాపరి సామ్సన్ షుకార్డిన్, 2015 నుంచి హైదరాబాద్ మేత్రాసనం పీఠకాపరిగా సేవలందిస్తున్నారు. ఆయన ప్రస్తుతం పాకిస్తాన్ కతోలిక పీఠాధిపతుల సమాఖ్య అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

పాకిస్తాన్‌లో మత స్వేచ్ఛ, మానవ హక్కులు, సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రముఖ శ్రీసభ నాయకుల్లో ఒకరైన పీఠకాపరి సామ్సన్ షుకార్డిన్, 2015 నుంచి హైదరాబాద్ మేత్రాసనం పీఠకాపరిగా సేవలందిస్తున్నారు. ఆయన ప్రస్తుతం పాకిస్తాన్ కతోలిక పీఠాధిపతుల సమాఖ్య అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

జూలై 20 నుంచి 26 వరకు ఇండోనేషియాలోని జకార్తాలో జరగనున్న ఆసియా పీఠాధిపతుల సమాఖ్య (FABC) 12వ ప్లీనరీ మహాసభకు ముందు, ఆ మహాసభపై తన ఆశలు, అంతర్మత సంభాషణ ప్రాముఖ్యత, అలాగే ఆసియా శ్రీసభకు పాకిస్తాన్ శ్రీసభ అందిస్తున్న సేవలు, అనుభవాల గురించి **రేడియో వెరిటాస్ ఆసియా (RVA)**తో పీఠకాపరి సామ్సన్ షుకార్డిన్ ప్రత్యేకంగా మాట్లాడారు.

ముఖ్యాంశాలు...
RVA: మహోదయా, జకార్తాలో జరగనున్న FABC ప్లీనరీ మహాసభపై మీ ప్రధాన ఆశలు ఏమిటి?
పీఠకాపరి సామ్సన్:

ఈ మహాసభ ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీసభల మధ్య పరస్పర ఐక్యతను, ఒకరినొకరు ఆలకించే సినొడల్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుందని నేను ఆశిస్తున్నాను. పాకిస్తాన్ వంటి అల్పసంఖ్యాక శ్రీసభకు FABC అనేది ఆసియా కతోలిక శ్రీసభతో అనుసంధానమయ్యే అత్యంత విలువైన వేదిక.

ఈ మహాసభ ద్వారా ఆసియాలోని వివిధ పీఠాధిపతుల సమాఖ్యల మధ్య పరస్పర బంధాలు మరింత బలపడాలని, పాస్టోరల్ సవాళ్లను పరస్పరం పంచుకుంటూ, వేగంగా మారుతున్న ఆసియా సామాజిక–రాజకీయ పరిస్థితుల్లో సువార్త ప్రకటనా ధ్యేయం పట్ల మన ఉమ్మడి నిబద్ధతను పునరుద్ధరించుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను.

RVA: ఈ మహాసభలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చ జరగాలని మీరు కోరుకుంటున్నారు?
పీఠకాపరి సామ్సన్:

ఆసియాలో పెరుగుతున్న మత అసహనం, అట్టడుగు వర్గాలకు చెందిన అల్పసంఖ్యాక సమాజాల రక్షణ, అలాగే యువత సాధికారత వంటి అంశాలపై మహాసభ లోతుగా చర్చించాలని నేను ఆశిస్తున్నాను.

అదేవిధంగా, ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక అస్థిరత, పాకిస్తాన్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న వాతావరణ మార్పుల సంక్షోభం కూడా అత్యవసర పాస్టోరల్ అంశాలుగా పరిగణించాలి.

అలాగే, డిజిటల్ విప్లవం తీసుకొస్తున్న వేగవంతమైన మార్పులను కూడా మనం గంభీరంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. పరమపవిత్రులు పోప్ లియో XIV తన తాజా సామాజిక విజ్ఞాపన **"మాగ్నిఫికా హ్యుమానిటాస్"**లో పేర్కొన్నట్లుగా, కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) నైతిక నియంత్రణ లేకుండా అభివృద్ధి చెందితే, అత్యంత బలహీన వర్గాల ప్రజలు మరింత మానవత్వహీనతకు, ఆర్థిక అసమానతలకు గురయ్యే ప్రమాదం ఉంది.

సాంప్రదాయిక సామాజిక అసమానతలతో పాటు ఈ నూతన సాంకేతిక పరిణామాల మధ్య కూడా మానవ గౌరవాన్ని శ్రీసభ ఎలా పరిరక్షించగలదనే అంశంపై మహాసభ స్పష్టమైన మార్గదర్శకాలను అందించాలని నేను ఆశిస్తున్నాను. వివక్ష, పేదరికంతో పోరాడుతున్న కుటుంబాలకు ఆచరణాత్మక ఆశను అందించాల్సిన బాధ్యత శ్రీసభపై ఉంది.

RVA: ఆసియా శ్రీసభకు పాకిస్తాన్ శ్రీసభ అందించగల ప్రత్యేకమైన సేవ ఏమిటి?
పీఠకాపరి సామ్సన్:

పాకిస్తాన్ శ్రీసభ ధైర్యసాహసాలకు, అచంచల విశ్వాసానికి సజీవ సాక్ష్యం. మేము దీనిని "జీవిత సంభాషణ" (Dialogue of Life) అని పిలుస్తాము.

అల్పసంఖ్యాక సమాజమైనప్పటికీ, విద్య, ఆరోగ్య సేవల ద్వారా మతభేదం లేకుండా ప్రతి పౌరుడికి సేవలందిస్తున్నాము. అలాగే అభ్యుదయవాద ముస్లిం పండితులతో స్థానిక స్థాయిలో నిరంతర సంభాషణ కొనసాగిస్తున్నాము.

ఈ అనుభవం ద్వారా, అల్పసంఖ్యాక శ్రీసభ కూడా శాంతి నిర్మాణంలో శక్తివంతమైన పాత్ర పోషించగలదని మేము నిరూపిస్తున్నాము. సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో కూడా ఇతర మతాలతో ధైర్యంగా సహజీవనం చేయగల మార్గాన్ని ఆసియా శ్రీసభతో పంచుకోవాలనుకుంటున్నాము.

RVA: ఈ మహాసభలో "సినొడల్ పరివర్తన" మరియు "వారధుల నిర్మాణం" ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఇవి పాకిస్తాన్ శ్రీసభ వాస్తవ పరిస్థితులకు ఎలా అనుసంధానమవుతున్నాయి?
పీఠకాపరి సామ్సన్:

పాకిస్తాన్‌లో ఇవి కేవలం సిద్ధాంతాలు కావు; ప్రతి రోజు ఆచరణలో ఉండే పాస్టోరల్ అవసరాలు.

సినొడల్ పరివర్తన అంటే గురువులు, కన్యస్త్రీలు, లౌకిక విశ్వాసులు కలిసి నడుస్తూ, ముఖ్యంగా సింధ్ వంటి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక ఇబ్బందులు, సామాజిక బలహీనతలను ఎదుర్కొంటున్న కుటుంబాలకు తోడుగా నిలవడం.

వారధులను నిర్మించడం మా శ్రీసభ సహజ జీవన విధానం. మా విద్యా, సేవా సంస్థలు, మానవ హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే వేదికల ద్వారా ప్రతి రోజూ ప్రజల మధ్య వారధులను నిర్మిస్తున్నాము. ఉమ్మడి మానవత్వం అనే బంధంతో ఒకరినొకరు చేరుకోవడం ద్వారా అపోహలను, పక్షపాతాలను అధిగమించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాము.

RVA: భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, ఈ మహాసభ ఆసియా శ్రీసభకు ఎలాంటి స్పష్టమైన ఫలితాలను అందించాలని మీరు ఆశిస్తున్నారు?
పీఠకాపరి సామ్సన్:

ఈ మహాసభ కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, స్థానిక స్థాయిలో అమలు చేయగల సమగ్ర పాస్టోరల్ కార్యాచరణ ప్రణాళికను ఆసియా శ్రీసభకు అందించాలని నేను ఆశిస్తున్నాను.

ముఖ్యంగా ఆసియాలోని పీఠాధిపతుల సమాఖ్యల మధ్య పరస్పర సహకార వ్యవస్థలు మరింత బలోపేతం కావాలి. యువజనులు, నాయకత్వ వికాసం కోసం ప్రాంతీయ కార్యక్రమాలు విస్తరించాలి.

అలాగే, మానవ హక్కులు, మత స్వేచ్ఛ పరిరక్షణకు ప్రపంచ వేదికపై ఆసియా కతోలికుల ఉమ్మడి స్వరం మరింత బలంగా, స్పష్టంగా వినిపించాలని నేను కోరుకుంటున్నాను.