నాలుగు దశాబ్దాలుగా కతోలిక సమాజానికి వారధిగా నిలిచిన బంగ్లాదేశ్ ముస్లిం దుకాణదారుడు
"సినొడల్ పరివర్తనకు పిలుపు – ఆసియాలో వారధులుగా, వారధుల నిర్మాణకర్తలుగా ఉండే శ్రీసభ ధ్యేయం" అనే ఇతివృత్తంతో ఇండోనేషియాలోని జకార్తాలో జరగనున్న ఆసియా పీఠాధిపతుల సమాఖ్య (FABC) 12వ ప్లీనరీ మహాసభకు ఆసియా శ్రీసభ సన్నద్ధమవుతున్న వేళ, విభిన్న మత సమాజాల మధ్య రోజువారీ జీవితంలో ఏర్పడే ఆత్మీయ బంధాలు, సంభాషణ మరియు సహకారం ఎలా ఆచరణలో రూపుదిద్దుకుంటాయో తెలియజేసే అనేక ప్రేరణాత్మక సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
అలాంటి హృదయస్పర్శి ఉదాహరణలలో ఒకటి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో కనిపిస్తుంది. అక్కడ ఓ ముస్లిం దుకాణదారుడు దాదాపు నాలుగు దశాబ్దాలుగా కతోలిక సమాజానికి ఆరాధనా చిత్రాలను అందిస్తూ, విశ్వాసులు, గురువులు, కన్యస్త్రీలు, ధార్మికుల మధ్య విశ్వాసపూరితమైన అనుబంధాన్ని పెంపొందిస్తూ వస్తున్నారు.
73 ఏళ్ల మొహమ్మద్ అబ్దుర్ రషీద్, ఢాకాలోని ఫార్మ్‌గేట్ ప్రాంతంలో ఉన్న తేజ్‌గావ్ కతోలిక దేవాలయం పక్కన "రషీద్ గ్లాస్ హౌస్" అనే దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. 1988 నుంచి యేసుక్రీస్తు, పవిత్ర కన్య మరియమ్మ, పవిత్ర కుటుంబం, పునీత యోసేపు, పునీత ఆంథోని, పునీత మదర్ తెరిస్సా, అలాగే పరమపవిత్రులు పోప్ లియో XIV చిత్రాలను ఫ్రేమ్‌లతో విక్రయించడం ఆయన వ్యాపారంలో అంతర్భాగమైంది.
తేజ్‌గావ్ పరిషత్తు, హోలీ క్రాస్ పాఠశాల సమీపంలో ఉన్న ఈ దుకాణం బంగ్లాదేశ్‌లోని అతిపెద్ద కతోలిక సమాజాలలో ఒకదానికి సేవలందిస్తోంది. ఉపాధి కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి ఢాకాకు వలస వచ్చిన అనేక కుటుంబాలతో సహా, ఈ పరిషత్తు పరిధిలో పదివేల మందికిపైగా కతోలికులు నివసిస్తున్నారు.
ముస్లింగా జన్మించిన రషీద్ మాట్లాడుతూ, కతోలిక సమాజంతో తన అనుబంధం మొదట వ్యాపార అవకాశంగా ప్రారంభమైనప్పటికీ, కాలక్రమేణా అది పరస్పర విశ్వాసం, గౌరవం మీద నిర్మితమైన ఆత్మీయ బంధంగా మారిందని చెప్పారు.
"కళాశాలలో చదువుతున్న రోజులలో నేను ఒక చిత్రాల ఫ్రేమింగ్ దుకాణంలో పనిచేసేవాడిని. తర్వాత ఫార్మ్‌గేట్ వద్ద నా స్వంత దుకాణాన్ని ప్రారంభించాను. ఒక రోజు దేవాలయం పక్కన ఎవరో యేసుక్రీస్తు చిత్రాలను విక్రయిస్తున్నట్లు గమనించాను. అప్పటి నుంచి క్రైస్తవ ఆరాధనా చిత్రాలను కూడా విక్రయించడం ప్రారంభించాను," అని ఆయన గుర్తు చేసుకున్నారు.
కాలక్రమేణా ఆయన వ్యాపారం విస్తరించింది. ప్రస్తుతం ఆయన కుమారుడు కూడా దుకాణ నిర్వహణలో భాగస్వామిగా ఉన్నారు. విద్యార్థులు, స్థానిక ప్రజలకు ఫోటోకాపీ సేవలను కూడా ఈ దుకాణం అందిస్తోంది. తన వద్దకు వచ్చే వినియోగదారుల్లో సుమారు 80 శాతం మంది కతోలికులేనని రషీద్ తెలిపారు.
"నా దుకాణానికి గురువులు, కన్యస్త్రీలు, ధార్మికులు, కొన్నిసార్లు పీఠకాపరులు కూడా వస్తుంటారు. వారు నాతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతారు. వారిని కలవడం నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది," అని ఆయన చెప్పారు.
క్రైస్తవ ఆరాధనా వస్తువులను విక్రయిస్తున్నందుకు తన ముస్లిం సమాజం నుంచి ఎన్నడూ విమర్శలు ఎదురుకాలేదని రషీద్ తెలిపారు.
ఆయన దుకాణంలో ఒకవైపు యేసుక్రీస్తు, మరియమ్మ తదితర క్రైస్తవ ఆరాధనా చిత్రాలు ఉండగా, మరోవైపు ఇస్లామీయ కళిగ్రఫీ, మక్కా–మదీనా చిత్రాలు, ఖురాన్ వచనాలు కూడా సమానంగా అలంకరించి కనిపిస్తాయి.
కతోలిక విశ్వాసులకు ఈ దుకాణం ఎంతో పరిచితమైన ఆరాధనా వస్తువుల కేంద్రంగా మారింది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడి వినియోగదారుడైన వ్యాపారవేత్త సుబీర్ గోమ్స్, ఇటీవల తన కుటుంబం కోసం చివరి భోజనం (లాస్ట్ సప్పర్) మరియు పవిత్ర కన్య మరియమ్మ చిత్రాలను కొనుగోలు చేశారు.
"ఇంట్లో ఆరాధనా చిత్రాలు ఉంటే వాటి ఎదుట ప్రార్థించవచ్చు. జీవితంలోని క్లిష్టమైన సందర్భాల్లో అలాంటి ప్రార్థన మనసుకు శాంతిని అందిస్తుంది," అని ఆయన అన్నారు.
రషీద్ అందిస్తున్న సేవలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
"ఆయన ముస్లిం అయినప్పటికీ క్రైస్తవులకు ఎంతో విలువైన సేవ చేస్తున్నారు. ఆయన చేస్తున్న సేవకు మేమంతా కృతజ్ఞులం," అని గోమ్స్ చెప్పారు.
సుమారు 17 కోట్ల జనాభా కలిగిన బంగ్లాదేశ్‌లో కతోలికుల సంఖ్య దాదాపు 4.5 లక్షలు మాత్రమే. అయినప్పటికీ, తేజ్‌గావ్ కతోలిక సమాజంతో రషీద్‌కు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ అనుబంధం, భిన్న మతాలకు చెందిన ప్రజల మధ్య నిత్యజీవితంలో ఏర్పడే సాధారణ మానవ సంబంధాలే పరస్పర అవగాహనకు, సౌహార్దానికి బలమైన పునాదులుగా నిలుస్తాయని చాటి చెబుతోంది.
తేజ్‌గావ్ కతోలిక దేవాలయానికి సమీపంలో నివసించే విశ్వాసులకు రషీద్ దుకాణం కేవలం ఒక వ్యాపార కేంద్రం మాత్రమే కాదు; విశ్వాసం, పరస్పర గౌరవం, స్నేహం, సామాజిక సహజీవనం అనే విలువలతో విభిన్న మత సంప్రదాయాలను కలిపే ఒక సజీవ వారధిగా మారింది.