ఆసియాలో అతిపెద్ద ముస్లిం జనాభా కలిగిన దేశంలో వారధులను నిర్మిస్తున్న జకార్తా అగ్ర మేత్రాసనం

ఇండోనేషియాలో శ్రీసభ
ఆసియాలోని ప్రముఖ కతోలిక అగ్ర మేత్రాసనాలలో ఒకటైన జకార్తా అగ్ర మేత్రాసనం, ఇండోనేషియాలో శ్రీసభ జీవనానికి ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవడమే కాకుండా, అంతర్మత సంభాషణ, సామాజిక అభివృద్ధి, జాతి నిర్మాణ కార్యక్రమాలను ముందుకు నడిపించడంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది.
(ఫోటో: వాటికన్ న్యూస్)

2026 జూలై 20 నుంచి 26 వరకు ఆసియా పీఠాధిపతుల సమాఖ్య (FABC) 12వ ప్లీనరీ మహాసభకు ఆతిథ్యం ఇవ్వనున్న జకార్తా అగ్ర మేత్రాసనం, ఆసియాలో సంభాషణ, ఐక్యత, వారధుల నిర్మాణం అనే శ్రీసభ ధ్యేయానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.

ఆసియాలోని ప్రముఖ కతోలిక అగ్ర మేత్రాసనాలలో జకార్తా అగ్ర మేత్రాసనం ఒకటి. ఇండోనేషియా రాజధానిలో కతోలిక శ్రీసభకు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న ఈ అగ్ర మేత్రాసనం, స్థానిక శ్రీసభ జీవనంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం జనాభా కలిగిన దేశంలో అంతర్మత సంభాషణ, సామాజిక అభివృద్ధి, జాతి నిర్మాణం వంటి రంగాల్లోనూ విశిష్టమైన సేవలను అందిస్తోంది.

రెండు శతాబ్దాలకు పైగా సాగిన తన ప్రస్థానంలో, వలస పాలనా కాలంలో ఒక చిన్న మిషనరీ ప్రాంతంగా ప్రారంభమైన ఈ శ్రీసభ, నేడు సంభాషణ, సేవ, సంఘీభావం ద్వారా సువార్తను ప్రకటించే చైతన్యవంతమైన స్థానిక శ్రీసభగా వికసించింది.

రెండు శతాబ్దాల విశ్వాస ప్రస్థానం

1807 మే 8న పరమపవిత్రులు పోప్ పియస్ VII, డచ్ ఈస్ట్ ఇండీస్ ప్రాంతంలోని కతోలిక విశ్వాసుల సేవ కోసం బటావియా అపోస్తలిక ప్రిఫెక్చర్ను స్థాపించడంతో ఈ అగ్ర మేత్రాసనం చరిత్ర ప్రారంభమైంది.

శ్రీసభ విస్తరిస్తూ వచ్చిన నేపథ్యంలో, 1841 ఏప్రిల్ 3న పవిత్ర సింహాసనం బటావియాను అపోస్తలిక వికరియేట్గా అభివృద్ధి చేసింది. ఈ మిషనరీ కేంద్రం నుంచే తరువాత ఇండోనేషియా అంతటా అనేక అపోస్తలిక ప్రిఫెక్చర్లు, వికరియేట్లు ఏర్పడి, కాలక్రమేణా పూర్తి స్థాయి మేత్రాసనాలుగా ఎదిగాయి.

ఈ అభివృద్ధిలో ముఖ్యంగా జెసూట్ సంఘం సహా అనేక ధార్మిక సంఘాలు విశేష పాత్ర పోషించాయి. వారు స్థాపించిన విద్యాసంస్థలు, ఆసుపత్రులు, సెమినరీలు, సేవా సంస్థలు నేటికీ శ్రీసభ సేవా ధ్యేయానికి బలమైన పునాదులుగా నిలిచాయి.

స్థానిక శ్రీసభగా ఎదుగుదల

ఇండోనేషియా స్వాతంత్ర్యం అనంతరం స్థానిక శ్రీసభ కొత్త దశలోకి ప్రవేశించింది.

1950లో బటావియా అపోస్తలిక వికరియేట్ పేరును జకార్తా అపోస్తలిక వికరియేట్గా మార్చడం ద్వారా దేశపు కొత్త జాతీయ గుర్తింపును ప్రతిబింబించింది.

1961 జనవరి 3న పరమపవిత్రులు పోప్ జాన్ XXIII, దీనిని జకార్తా అగ్ర మేత్రాసనంగా ప్రకటించారు. బండుంగ్, బోగోర్ మేత్రాసనాలు దీనికి అనుబంధ మేత్రాసనాలుగా ఏర్పాటు చేయబడ్డాయి. దీంతో బలమైన స్థానిక నాయకత్వంతో ఎదుగుతున్న ఇండోనేషియా శ్రీసభకు కొత్త అధ్యాయం ప్రారంభమైంది.

సేవా నాయకత్వం – సంభాషణకు దారితీసిన పయనం

జకార్తా అగ్ర మేత్రాసనానికి అనేక మంది విశిష్ట అగ్రపీఠాధిపతులు నాయకత్వం వహించారు. వారిలో జకార్తాకు తొలి ఇండోనేషియా అగ్రపీఠాధిపతిగా సేవలందించిన మహా పూజ్య అడ్రియానస్ జజాసెపుత్రా, ఎస్.జే., అనంతరం మహా పూజ్య లియో సుకోటో, ఎస్.జే., కార్డినల్ జూలియస్ దర్మాత్మద్జా, ఎస్.జే., ప్రస్తుతం అగ్రపీఠాధిపతిగా సేవలందిస్తున్న కార్డినల్ ఇగ్నేషియస్ సుహార్యో హార్డ్జోత్మోజో ప్రముఖులు.

వారి నాయకత్వంలో ఈ అగ్ర మేత్రాసనం పాస్టోరల్ పునరుద్ధరణ, సామాజిక బాధ్యత, ఇతర మతాలు, సంస్కృతుల ప్రజలతో సంభాషణ వంటి రంగాల్లో తన సేవలను మరింత విస్తరించింది.

సంభాషణే శ్రీసభ పరిచర్యకు హృదయం

ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యభరితమైన మత, సాంస్కృతిక సమాజాలలో ఒకటైన ఇండోనేషియాలో జీవిస్తున్న జకార్తా అగ్ర మేత్రాసనం, సంభాషణను తన పరిచర్యలో అంతర్భాగంగా భావిస్తోంది.

రెండవ వాటికన్ మహాసభ బోధనలు, ఆసియా పీఠాధిపతుల సమాఖ్య (FABC) దార్శనికత స్ఫూర్తితో, మతం, జాతి, సామాజిక నేపథ్యం అనే భేదాలు లేకుండా అందరికీ సేవలందించడం ద్వారా సువార్తను ప్రకటిస్తోంది.

ఈ నిబద్ధత విద్య, ఆరోగ్య సేవలు, సామాజిక సంక్షేమం, మానవతా సేవలు, సమాజాభివృద్ధి కార్యక్రమాల్లో స్పష్టంగా ప్రతిఫలిస్తోంది.

స్నేహ సొరంగం – అంతర్మత సామరస్యానికి చిహ్నం

ఈ సంభాషణ స్ఫూర్తికి అత్యంత స్పష్టమైన చిహ్నం జకార్తా కేథడ్రల్ మరియు ఇండోనేషియా జాతీయ మసీదు ఇస్తిక్లాల్ మసీదు మధ్య నెలకొన్న అనుబంధం.

రాజధాని నడిబొడ్డున ఒకదానికొకటి ఎదురెదురుగా నిలిచిన ఈ రెండు ప్రార్థనా మందిరాలు నేడు ప్రపంచవ్యాప్తంగా అంతర్మత సామరస్యానికి ప్రతీకలుగా గుర్తింపు పొందాయి.

వీటిని అనుసంధానించే "స్నేహ సొరంగం" (Terowongan Silaturahmi) శాంతి, పరస్పర గౌరవం, సహకారం పట్ల వివిధ మత సమాజాల ఉమ్మడి నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తోంది.

పోప్ ఫ్రాన్సిస్ సందర్శనతో ప్రపంచ దృష్టి

2024 సెప్టెంబరులో పరమపవిత్రులు పోప్ ఫ్రాన్సిస్ ఇండోనేషియాను సందర్శించిన సందర్భంగా జకార్తా అగ్ర మేత్రాసనం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది.

ఇస్తిక్లాల్ మసీదులో ముస్లిం మత నాయకులతో కలిసి పోప్ ఫ్రాన్సిస్ "ఇస్తిక్లాల్ సంయుక్త ప్రకటన–2024"పై సంతకం చేసి, శాంతి, సౌభ్రాతృత్వం, మన ఉమ్మడి గృహమైన సృష్టి సంరక్షణ కోసం అన్ని మతాల ఉమ్మడి బాధ్యతను పునరుద్ఘాటించారు.

ఈ చారిత్రక సంఘటన, ఆసియాలో నిర్మాణాత్మక అంతర్మత సంభాషణకు జకార్తాను ఒక ఆదర్శంగా ప్రపంచానికి పరిచయం చేసింది.

సినొడల్ స్ఫూర్తితో ముందుకు

నేడు జకార్తా అగ్ర మేత్రాసనం జకార్తా, బెకాసి, టాంగెరాంగ్ ప్రాంతాల్లోని అనేక పరిషత్తులకు వందలాది గురువులు, కన్యస్త్రీలు, ధార్మిక సభ్యులు, వేలాది లౌకిక విశ్వాసుల సేవల ద్వారా ఆధ్యాత్మిక నాయకత్వం అందిస్తోంది.

సినొడల్ స్ఫూర్తితో, ప్రతి విశ్వాసి చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ, పేదలు, అట్టడుగు వర్గాలు, అత్యంత అవసరంలో ఉన్న ప్రజల పట్ల తన సేవలను మరింత విస్తరిస్తోంది.

FABC మహాసభకు ఎందుకు జకార్తా?

బహుళత్వ సమాజంలో సువార్తను జీవించి ప్రకటించిన ఈ సుదీర్ఘ అనుభవమే, 2026 జూలై 20–26 మధ్య జరగనున్న ఆసియా పీఠాధిపతుల సమాఖ్య (FABC) 12వ ప్లీనరీ మహాసభకు జకార్తాను అత్యంత సముచిత ఆతిథ్య నగరంగా నిలబెట్టింది.

"సినొడల్ పరివర్తనకు పిలుపు – ఆసియాలో వారధులుగా, వారధుల నిర్మాణకర్తలుగా ఉండే శ్రీసభ ధ్యేయం" అనే ఇతివృత్తంతో జరగనున్న ఈ మహాసభ, జకార్తా అగ్ర మేత్రాసనం తన చరిత్ర అంతటా జీవించిన అదే దార్శనికతను ప్రతిబింబిస్తోంది—సంభాషణ, సేవ, సౌభ్రాతృత్వం ద్వారా వారధులను నిర్మించడం.

ఇండోనేషియా వైవిధ్యభరిత సమాజం నడిబొడ్డున నిలిచిన జకార్తా అగ్ర మేత్రాసనం, సువార్తను అత్యంత ప్రభావవంతంగా ప్రకటించేది ప్రేమతో కూడిన సహకారం, విశాల హృదయం, కార్యరూపం దాల్చిన సేవ ద్వారానే అని నేటికీ తన జీవిత సాక్ష్యంతో ప్రపంచానికి చాటిచెబుతోంది.