ఆ పుర్రె ఎవరిది?? పుర్రెకు కిరీటం ఎందుకు?

సెయింట్ అగాథా గారి పుర్రెను విశ్వాసుల దర్శనానికి ఉంచి, తరువాత తిరిగి ఆ రెలిక్వరీలో ఉంచారు.

ఆ పుర్రె ఎవరిది?? పుర్రెకు కిరీటం ఎందుకు?

శతాబ్దాల నాటి ఒక పవిత్ర అవశేషానికి అసాధారణమైన పట్టాభిషేక కార్యక్రమం ఆగస్టు 17, 2026న ఇటలీలోని సిసిలీ (Sicily) ప్రాంతంలోని కటానియా (Catania) నగరంలో జరిగింది.ఈ కార్యక్రమానికి కార్డినల్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ పీట్రో పరోలిన్ గారు అధ్యక్షత వహించారు. 

సెయింట్ అగాథా ( St. Agatha)3వ శతాబ్దంలో మన ప్రభువైన యేసు క్రీస్తు విశ్వాసం కోసం హతసాక్షిగా మరణించిన యువ క్రైస్తవురాలు. ఆమెను కటానియా నగరానికి ప్రధాన పరిరక్షకురాలిగా (Patron Saint) విశ్వాసులు గౌరవిస్తారు. 

సెయింట్ అగాథా (St. Agatha) పవిత్ర అవశేషాలు  కటానియాకు తిరిగి వచ్చిన 900వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సెయింట్ అగాథా గారి పుర్రెను విశ్వాసుల  దర్శనానికి ఉంచి, తరువాత తిరిగి ఆ రెలిక్వరీలో ఉంచారు. 

కార్యక్రమంలో భాగంగా కాటానియాలో చారిత్రాత్మక ఊరేగింపు నిర్వహించారు . ఈ వేడుకలో పరిశుద్ధ లియో XIV పాపు గారి  ప్రతినిధిగా వచ్చిన మహా పూజ్య కార్డినల్ పీట్రో పరోలిన్ సెయింట్ అగాథా పుర్రె అవశేషాన్ని పవిత్రంగా ముద్దాడి, దానికి కిరీటధారణ (Crowning Ceremony) చేశారు.

పునీత అగాథా సిసిలీలోని కాటానియా లేదా పలెర్మో నగరంలో ఒక సంపన్న క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. చిన్న వయస్సులోనే తన జీవితాన్ని పూర్తిగా యేసుక్రీస్తుకు అంకితం చేసి, పవిత్ర కన్యగా జీవించాలని నిర్ణయించుకున్నారు.

సిసిలీ గవర్నర్ క్వింటియానస్ ఆమెను వివాహం చేసుకోవాలని, తన కోరికకు లొంగాలని ఒత్తిడి చేశాడు. కానీ అగాథా తన క్రైస్తవ విశ్వాసాన్ని వదులుకోవడానికి నిరాకరించారు.

దాంతో ఆమెను జైలులో బంధించి తీవ్రంగా హింసించారు. ఆమె శరీరంపై క్రూరమైన శిక్షలు విధించినట్లు పురాతన క్రైస్తవ కథనం చెబుతుంది.అత్యంత దారుణమైన హింసల్లో ఒకటిగా, ఆమె రొమ్ములను కోసివేసినట్లు ‘Acts of St. Agatha’లో వివరించబడింది. అయినప్పటికీ అగాథా తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. చివరి క్షణాల్లో కూడా ప్రార్థిస్తూ తన జీవితాన్ని దేవునికి సమర్పించారు.

క్రైస్తవ సంప్రదాయం ప్రకారం, క్రీ.శ. 251 ఫిబ్రవరి 5న ఆమె జైలులోనే మరణించారు. క్రీస్తుపై తన విశ్వాసం కోసం ప్రాణత్యాగం చేసిన పవిత్ర కన్యగా పునీత అగాథా క్రైస్తవ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు.

క్యాథలిక్ విశ్వాసం ప్రకారం ఆరాధన దేవునికి మాత్రమే చెందుతుంది. పవిత్రుల అవశేషాలను గౌరవించడం అంటే ఆ వస్తువునే దేవుడిగా భావించడం కాదు.
అది ఆ పవిత్ర వ్యక్తి విశ్వాసాన్ని, త్యాగాన్ని గుర్తుచేసుకోవడం, ఆయన/ఆమె ద్వారా దేవుడు చేసిన కార్యాన్ని గౌరవించడం మాత్రమే.


Article and Design BY M Kranthi Swaroop

 

 

Telugu Survey Popup Image