FABC 2026: సేవా పరిచర్య ద్వారా వారధులు నిర్మిస్తున్న పాకిస్తాన్ కతోలిక శ్రీసభ
ఆసియా పీఠాధిపతుల సమాఖ్య (FABC) 12వ ప్లీనరీ మహాసభ జూలై 20 నుండి 26 వరకు ఇండోనేషియాలోని జకార్తాలో జరగనుంది. "సినొడల్ పరివర్తనకు పిలుపు మరియు ఆసియాలో వారధులుగా ఉండి, వారధులను నిర్మించే తిరుసభ యొక్క ధ్యేయం" అనే ప్రధాన అంశంపై ఆసియా నలుమూలల నుంచి విచ్చేసే పీఠకాపరులు ఈ మహాసభలో లోతైన ఆత్మపరిశీలన చేయనున్నారు.
240 మిలియన్లకు పైగా జనాభా కలిగిన పాకిస్తాన్లో క్రైస్తవులు రెండు శాతానికి కూడా తక్కువ. అలాంటి పరిస్థితుల్లో అక్కడి కతోలిక శ్రీసభకు మతాల మధ్య సంభాషణ అనేది కేవలం ఒక పాస్టోరల్ కార్యక్రమం మాత్రమే కాదు; అది తమ ఉనికిని కాపాడుకునే జీవన విధానం. కఠినమైన దైవదూషణ చట్టాలు, మత ఘర్షణలు, మైనారిటీ బాలికల వ్యవస్థీకృత అపహరణలు, సామాజిక-ఆర్థిక వివక్ష వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న పాకిస్తాన్ క్రైస్తవులకు విభజన ఎంతటి మూల్యం చెల్లించాల్సి వస్తుందో బాగా తెలుసు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వారధి నిర్మించడం అంటే మతాల మధ్య ఏర్పడిన లోతైన అగాధాలను అధిగమించి, వైరానికి బదులుగా పరస్పర మానవ గౌరవాన్ని నెలకొల్పడం.
పాకిస్తాన్ కతోలిక శ్రీసభ నిర్మించిన అత్యంత బలమైన వారధులు దశాబ్దాలుగా అందిస్తున్న నిస్వార్థ సంస్థాగత సేవలపై ఆధారపడి ఉన్నాయి. ఆ సేవల ఫలితాలను సమాజమంతా అనుభవిస్తోంది.
సామరస్యానికి నిలయాలుగా విద్యాసంస్థలు
అంతర్మత సంభాషణకు ప్రత్యేక కమిషన్లు ఏర్పడకముందే, కరాచీలోని సెయింట్ ప్యాట్రిక్స్ పాఠశాల, లాహోర్లోని సెయింట్ ఆంథోనీస్ పాఠశాల వంటి చారిత్రక కతోలిక విద్యాసంస్థలు సామాజిక ఐక్యతకు బలమైన పునాదులు వేశాయి.
తరతరాలుగా ఈ విద్యాసంస్థలు అధిక సంఖ్యలో ముస్లిం విద్యార్థులకు విద్యను అందిస్తూ, భవిష్యత్తు ప్రధానమంత్రులు, న్యాయమూర్తులు, సైనికాధికారులు మైనారిటీ విద్యార్థులతో కలిసి చదివే వాతావరణాన్ని కల్పించాయి. విశేషమేమిటంటే, పాకిస్తాన్ వ్యవస్థాపకుడు ఖైద్-ఎ-ఆజమ్ మహమ్మద్ అలీ జిన్నా కూడా సెయింట్ ప్యాట్రిక్స్ పాఠశాలలో కతోలిక గురువుల పర్యవేక్షణలోనే విద్యాభ్యాసం చేశారు.
విభిన్న మతాలకు చెందిన విద్యార్థులను ఒకే తరగతి గదిలో కలిపిన ఈ విద్యా విధానం, పక్షపాత ధోరణులను తగ్గించడంలోనూ, పరస్పర గౌరవాన్ని పెంపొందించడంలోనూ మౌనంగా కానీ గొప్ప పాత్ర పోషించింది.
ఆరోగ్య సేవలు – మానవతకు అంకితమైన పరిచర్య
ప్రకృతి వైపరీత్యాలు గానీ, ఆర్థిక సంక్షోభాలు గానీ సంభవించినప్పుడు, కతోలిక శ్రీసభ అందించే మానవతా సేవలకు మతపరమైన హద్దులు ఉండవు.
కారిటాస్ పాకిస్తాన్ తోపాటు స్థానిక కతోలిక ఆసుపత్రులు, అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ వారి మతాన్ని పరిగణనలోకి తీసుకోకుండా సహాయం అందిస్తున్నాయి. ఇటీవల సంభవించిన ఘోర వరదల సమయంలో తిరుసభ ఆధ్వర్యంలోని సహాయక బృందాలు దేశవ్యాప్తంగా సహాయక చర్యల్లో పాల్గొని, వేలాది నిరాశ్రయ ముస్లిం కుటుంబాలకు ఆశ్రయం, తాగునీరు, వైద్యసేవలను అందించి నిస్వార్థ సేవకు గొప్ప నిదర్శనంగా నిలిచాయి.
మార్గదర్శకులైన నాయకులు
పాకిస్తాన్ కతోలిక శ్రీసభ సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కొందరు విశిష్ట నాయకులు విశేష కృషి చేశారు.
కార్డినల్ జోసఫ్ కౌట్స్:
కరాచీ విశ్రాంత అగ్రపీఠాధిపతి అయిన కార్డినల్ కౌట్స్, "డొమినస్ వోబిస్కుం" (ప్రభువు మీతో ఉండును గాక) అనే తన ఆధ్యాత్మిక సూక్తిని అనుసరిస్తూ పరిచర్య సాగించారు. మత ఉద్రిక్తతలు తలెత్తిన ప్రతిసారి ప్రముఖ ఇస్లామిక్ పండితులు, మదరసా నాయకులతో నిరంతర సంభాషణ కొనసాగించి, సామాజిక హింసను నివారించేందుకు కీలక పాత్ర పోషించారు.
మహా పూజ్య సామ్సన్ షుకార్డిన్:
పాకిస్తాన్ కతోలిక పీఠాధిపతుల సమాఖ్య అధ్యక్షుడిగా ఆయన ముఖ్యంగా సింధ్ గ్రామీణ ప్రాంతాల్లో అణగారిన క్రైస్తవులు, దిగువ కులాలకు చెందిన హిందువుల హక్కుల కోసం గళమెత్తుతున్నారు. ముస్లిం మానవ హక్కుల కార్యకర్తలు, పాత్రికేయులతో కలిసి పనిచేస్తూ, మైనారిటీల సమస్యలను జాతీయ చర్చలోకి తీసుకురావడంలో విశేష కృషి చేస్తున్నారు.
గురుశ్రీ జేమ్స్ చన్నన్, ఓ.పి.:
లాహోర్లోని పీస్ సెంటర్ డైరెక్టర్గా సేవలందిస్తున్న డొమినికన్ గురువు, శాంతి సంస్కృతిని సంస్థాగత స్థాయిలో బలోపేతం చేయడానికి అనేక దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. స్థానిక శాంతి మండళ్లు, యునైటెడ్ రిలిజియన్స్ ఇనిషియేటివ్ (URI) వేదికల ద్వారా మత ఛాందసవాదాన్ని ఎదుర్కొనే ప్రజా స్థాయి సంభాషణలను ప్రోత్సహిస్తున్నారు.
గురుశ్రీ ఫ్రాన్సిస్ నదీమ్, ఓ.ఎఫ్.ఎం. క్యాప్.:
జాతీయ అంతర్మత సంభాషణ మరియు క్రైస్తవ ఐక్యత కమిషన్ కార్యనిర్వాహక కార్యదర్శిగా దీర్ఘకాలం సేవలందించిన ఈ దివంగత కపుచిన్ గురువు, పాకిస్తాన్లో అంతర్మత సంభాషణకు బలమైన పునాదులు వేశారు. అస్సీసి పునీత ఫ్రాన్సిస్ మరియు ఈజిప్టు సుల్తాన్ మధ్య జరిగిన చారిత్రక భేటీని ఆదర్శంగా తీసుకుని చేపట్టిన "పీస్ కారవాన్" కార్యక్రమాలు శాంతి విత్తనాలను సమాజంలో నాటాయి.
డా. రూత్ ఫౌ:
1960లో జర్మనీ నుంచి పాకిస్తాన్కు వచ్చిన ఈ దివంగత వైద్య కన్యస్త్రీ, ఐదు దశాబ్దాలకు పైగా దేశవ్యాప్తంగా కుష్ఠు వ్యాధి నిర్మూలనకు తన జీవితాన్ని అంకితం చేశారు. కరాచీలోని మేరీ అడిలైడ్ లెప్రసీ సెంటర్ ద్వారా అందించిన ఆమె సేవలు మత, సామాజిక భేదాలకు అతీతంగా సాగాయి. అందుకే ఆమెను ప్రజలు ప్రేమతో "పాకిస్తాన్ మదర్ తెరిసా"గా స్మరించడమే కాకుండా, పాకిస్తాన్ ప్రభుత్వం అరుదైన గౌరవంగా అధికారిక అంత్యక్రియలను నిర్వహించింది.
ఆసియాకు ప్రవచనాత్మక సాక్ష్యం
పాకిస్తాన్ కతోలిక శ్రీసభ సాక్ష్యం ఆసియాలోని మైనారిటీ తిరుసభలకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తోంది. ప్రవచనాత్మక సాక్షిగా ఉండటం అంటే భయంతో ఒంటరిగా జీవించడం కాదు; మెజారిటీ సమాజం వైపు స్నేహహస్తాన్ని చాపడం.
యువతకు విద్యను అందిస్తూ, రోగులను స్వస్థపరుస్తూ, ఇస్లామిక్ నాయకులతో నిరంతర సంభాషణ కొనసాగిస్తూ, పాకిస్తాన్ కతోలిక తిరుసభ ఒక గొప్ప సత్యాన్ని నిరూపిస్తోంది—శాంతియుత సహజీవనం అనేది సాధ్యం కాని ఆదర్శం కాదు; దేశ భవిష్యత్తును నిర్మించే అనివార్యమైన పునాది.