విజయవాడలో క్రైస్తవ సమైక్యతా విభాగ డైరెక్టర్ల సమావేశం

తెలుగు కతోలిక పీఠాధిపతుల మండలి (TCBC) ఆధ్వర్యంలోని క్రైస్తవ ఐక్యత మరియు మతాంతర సంభాషణ కమిషన్లు, తెలుగు ప్రాంతంలోని మేత్రాసనాల కమిషన్ డైరెక్టర్ల రెండు రోజుల సమావేశాన్ని నవంబర్ 4, 5 తేదీలలో విజయవాడలోని బిషప్స్ హౌస్ నందు  నిర్వహించాయి. 

నెల్లూరు సహాయక పీఠాధిపతి మహా పూజ్య డా. ఆంథోనీ దాస్ పిళ్లి ఈ సమావేశానికి అధ్యక్షత వహించగా, విజయవాడ పీఠాధిపతి మహా పూజ్య డా. టి. జోసెఫ్ రాజారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

గురుశ్రీ డా. విన్సెంట్ శేఖర్, క్రైస్తవ ఐక్యత మరియు మతాంతర సంభాషణ అనే అంశాలపై రెండు ఉపన్యాసాలు అందించారు. ఇతర క్రైస్తవ సంఘాలతో, వివిధ మతాలకు చెందిన ప్రజలతో సత్సంబంధాలను పెంపొందించుకోవడం శ్రీసభ మిషన్‌లో అత్యంత ముఖ్యమైన భాగమని ఆయన పేర్కొన్నారు.

తన కీలకోపన్యాసంలో అధ్యక్షులు పీఠాధిపతి ఆంథోనీ దాస్ పిళ్లి, సమాజంలోని విభిన్న వర్గాల మధ్య ఐక్యత, సోదరభావం, పరస్పర అవగాహనను పెంపొందించే వారధుల నిర్మాణకర్తలుగా మారాలని పిలుపునిచ్చారు. 

Nostra Aetate పత్రం 60వ వార్షికోత్సవం సందర్భంగా వాటికన్ విడుదల చేసిన *A Journey of Hope* పత్రం స్ఫూర్తితో విభేదాలను అధిగమించి, మానవాళి మరియు సృష్టి సమస్త శ్రేయస్సు కోసం కలిసికట్టుగా పనిచేయాలని ఆయన ప్రోత్సహించారు.

నవంబర్ 5వ తేదీన ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ సంఘాల ( APFC ) సమాఖ్యకు చెందిన వివిధ  క్రైస్తవ వర్గాల ప్రతినిధులతో మేత్రాసనాల డైరెక్టర్లు ముఖాముఖి చర్చలు జరిపారు. 

 క్రైస్తవ ఐక్యతను బలోపేతం చేయడం, క్రైస్తవులపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా సమిష్టి స్వరాన్ని వినిపించడం, వారి రాజ్యాంగ హక్కులను పరిరక్షించడం వంటి అంశాలపై చర్చించారు.

అనంతరం ప్రాంతీయ, మేత్రాసన నివేదికలను సమీక్షించి, ఇప్పటివరకు సాధించిన ప్రగతిని, ఎదురవుతున్న సవాళ్లను విశ్లేషించారు. తెలుగు ప్రాంతంలో క్రైస్తవ ఐక్యత, ఇతర క్రైస్తవ సంఘాలతో సహకారం, మతాంతర సంభాషణను బలోపేతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.

ముఖ్య అతిథి పీఠాధిపతి జోసఫ్ రాజారావు, కమిషన్ రూపొందించిన జాతీయ, ప్రాంతీయ  ప్రణాళికలను, వాటిలోని ఆచరణాత్మక ప్రతిపాదనలను అభినందించారు. ప్రతి మేత్రాసనం ఈ కార్యక్రమాలను అమలు చేయడానికి చొరవ చూపాలని సూచించారు. 

ఈ పరిచర్యలో కన్యస్త్రీలను భాగస్వాములను చేయడంతోపాటు, వారికి తగిన శిక్షణ అందించడం అవసరమని పేర్కొన్నారు.

ముగింపు ప్రసంగంలో అధ్యక్షులు పీఠాధిపతి ఆంథోనీ దాస్ పిళ్లి, క్రైస్తవ ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ నిబద్ధతతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా ఆలోచిస్తూ, 'నేను' అనే భావనకు బదులుగా 'మనం' అనే సమష్టి భావనతో ముందుకు సాగినప్పుడే నిజమైన ఐక్యత సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

ప్రాంతీయ కార్యదర్శి గురుశ్రీ అంతయ్య కొండవీటి పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అధ్యక్షులు ప్రార్థన, ఆశీర్వచనాలతో రెండు రోజుల సమావేశం ముగిసింది.

Telugu Survey Popup Image