సినడాలిటీ ద్వారా వారధుల నిర్మాణానికి ఆసియా శ్రీసభకు ప్రపంచ శ్రీసభ నాయకుల పిలుపు

వాటికన్, ఆఫ్రికా, యూరప్, మధ్యప్రాచ్యం, ఓషియానియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, అలాగే ప్రపంచ క్రైస్తవ ఐక్య సమాజానికి చెందిన శ్రీసభ నాయకులు FABC 12వ ప్లీనరీ సమావేశంలో పాల్గొని, శ్రీసభ చేపట్టిన సినడల్ ప్రయాణానికి తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ మరింత బలాన్ని చేకూర్చారు.

వాటికన్, ఆఫ్రికా, యూరప్, మధ్యప్రాచ్యం, ఓషియానియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, అలాగే ప్రపంచ క్రైస్తవ ఐక్య ఉద్యమానికి చెందిన శ్రీసభ నాయకులు Federation of Asian Bishops' Conferences (FABC) 12వ ప్లీనరీ సమావేశంలో పాల్గొని, విభజనలతో నిండిన నేటి ప్రపంచంలో శ్రీసభ చేపట్టిన సినడల్ ప్రయాణం సామరస్యం వైపు నడిపించే మార్గమని పేర్కొన్నారు.

జూలై 21న జకార్తాలోని హోటల్ ములియాలో జరిగిన ప్రారంభోత్సవం అనంతరం ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిన ఆసియ వెలుపలి ప్రాంతాల నాయకులు, తమ తమ ఖండాల్లో శ్రీసభ ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించారు. భిన్నమైన పరిస్థితుల్లో సేవ చేస్తున్నప్పటికీ, వారందరి సందేశం ఒక్కటే—సినడాలిటీ జీవన విధానంగా మారాలి.

ప్రపంచ శ్రీసభ తరఫున పాల్గొన్న పీఠాధిపతుల సినడ్ ప్రధాన కార్యదర్శి కార్డినల్ మారియో గ్రెక్, తాను "ఆలకించడానికి, పంచుకోవడానికి, నేర్చుకోవడానికి" ఈ సమావేశానికి వచ్చానని చెప్పారు.

వేగంగా మారుతున్న ప్రపంచ పరిస్థితుల మధ్య పరిశుద్ధాత్మ స్థానిక శ్రీసభలకు ఏమి చెబుతున్నారో వివేచించడం నేడు శ్రీసభ ముందున్న ప్రధాన సవాలని ఆయన అన్నారు. సినడల్ మార్గం కతోలికులను మరింత లోతైన ఐక్యతకు, సువార్త సేవలో నూతన నిబద్ధతకు పిలుస్తుందని ఆయన వివరించారు.

ఆఫ్రికా తరఫున పాల్గొన్న SECAM (Symposium of Episcopal Conferences of Africa and Madagascar) అధ్యక్షుడు, కార్డినల్ ఫ్రిడోలిన్ అంబోంగో బెసుంగు, ఆఫ్రికా, ఆసియా "సోదర ఖండాలు" అని పేర్కొన్నారు. పేదరికం, అసమానతలు, వలసలు, సాయుధ ఘర్షణలు, వాతావరణ మార్పులు వంటి అనేక వాస్తవికతలను రెండు ఖండాలు సమానంగా ఎదుర్కొంటున్నాయని తెలిపారు.

సినడాలిటీని "శ్రీసభగా జీవించే విధానం"గా అభివర్ణించిన ఆయన, సువార్త ప్రకటన, అంతర్మత సంభాషణ, యువజన సేవ, న్యాయం, శాంతి, సృష్టి సంరక్షణ వంటి రంగాల్లో ఆసియా, ఆఫ్రికా శ్రీసభలు మరింత సన్నిహితంగా సహకరించాలని పిలుపునిచ్చారు.

Council of European Bishops' Conferences (CCEE) తరఫున పాల్గొన్న అగ్రపీఠాధిపతి గింటారస్ లీనాస్ గ్రూషాస్, ఇటీవల రోమ్‌లో జరిగిన పీఠాధిపతుల సినడ్ వైవిధ్యం శ్రీసభను బలహీనపరచదని, మరింత బలపరుస్తుందని నిరూపించిందన్నారు.

విభజనలతో కూడిన ప్రపంచంలో గోడలు కట్టాలనే ప్రలోభాన్ని క్రైస్తవులు అధిగమించాలని ఆయన పిలుపునిచ్చారు. "మానవాళిని దేవునితోను, ప్రజలను పరస్పరం ఒకరితో ఒకరిని అనుసంధానం చేసే వారధిగా శ్రీసభ మారాలని పిలువబడింది," అని పేర్కొన్నారు.

తూర్పు కతోలిక పాట్రియార్కుల మండలి తరఫున మాట్లాడిన పాట్రియార్క్ 21 వ రాఫేల్ బెడ్రోస్ మినాసియన్, సినడ్ తుది పత్రంలోని మూడు ప్రధాన అంశాలను ప్రస్తావించారు. అవి—వివేచన ద్వారా ఆధ్యాత్మిక పరివర్తన, శ్రీసభ నిర్మాణాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం, అలాగే విభిన్న సంప్రదాయాలు, సంస్కృతులను ఆలింగనం చేసుకునే ఐక్యత.

"శ్రీసభ ఐక్యత అనేది అందరినీ ఒకే మాదిరిగా మార్చడం కాదు; భిన్నత్వంలో సుస్వర సమన్వయం," అని ఆయన అన్నారు.

Federation of Catholic Bishops Conferences of Oceania (FCBCO) ప్రధాన కార్యదర్శి గురుశ్రీ క్రిస్టోఫర్ డి సౌజా, ఓషియానియా తొలిసారిగా FABC ప్లీనరీ సమావేశంలో పాల్గొంటోందని తెలిపారు.

"ఆలకించడానికి, నేర్చుకోవడానికి" తమ శ్రీసభ ఈ సమావేశానికి వచ్చిందని ఆయన చెప్పారు. స్థానిక ఆదివాసీ సమాజాలు చాలాకాలంగా ఉమ్మడి వివేచన సంప్రదాయాలను ఆచరిస్తున్నప్పటికీ, సినడాలిటీ విషయంలో ఆసియా అనుభవం నుంచి తాము ఎంతో నేర్చుకోవచ్చని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో క్రైస్తవ ఐక్య ఉద్యమ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

Christian Conference of Asia (CCA) ప్రధాన కార్యదర్శి జంగ్ యూన్ గ్రేస్ మూన్, ప్రాంతీయ స్థాయిలో సంభాషణ, సహకారాన్ని ప్రోత్సహించడంలో CCA, FABCల మధ్య కొనసాగుతున్న దీర్ఘకాల భాగస్వామ్యాన్ని ప్రశంసించారు.

సినడాలిటీని కేవలం ఒక పాస్టరల్ విధానంగా కాకుండా, ప్రార్థన, ఆలకించడం, వివేచనలపై ఆధారపడిన ఆధ్యాత్మిక జీవన విధానంగా FABC స్వీకరించడాన్ని ఆమె అభినందించారు. ఆసియా తన ధ్యాన సంప్రదాయాలతో సినడల్ విధానాన్ని సమన్వయం చేయడం ద్వారా విశ్వవ్యాప్త శ్రీసభకు ఒక విశిష్టమైన కానుకను అందిస్తోందని పేర్కొన్నారు.

"ఆసియా వంటి విభిన్నతలతో, సంక్లిష్టతలతో, సవాళ్లతో కూడిన ప్రాంతంలో సినడల్ ప్రక్రియ కేవలం సముచితమైనదే కాదు; అది నిజంగా అత్యవసరం," అని ఆమె పేర్కొంటూ, ప్రపంచ క్రైస్తవ ఐక్య సమాజం తరఫున తమ ప్రార్థనలను సమావేశానికి హామీ ఇచ్చారు.

United States Conference of Catholic Bishops (USCCB) తరఫున పాల్గొన్న శాక్రమెంటో సహాయ పీఠాధిపతి మహా పూజ్య రేనాల్డో బెర్సబల్, తాను "సహయాత్రికుడిగా" ఆసియా శ్రీసభల నుంచి నేర్చుకోవాలనే ఆసక్తితో వచ్చానని తెలిపారు.

నిజమైన శ్రీసభ పునరుద్ధరణ కేవలం నిర్మాణాత్మక సంస్కరణల ద్వారా సాధ్యం కాదని, వినయంతో కలిసి నడిచే, శ్రద్ధగా ఆలకించే, పరిశుద్ధాత్మపై విశ్వాసం ఉంచే శ్రీసభ ద్వారానే అది సాధ్యమవుతుందని ఆయన అన్నారు. అమెరికాలోని శ్రీసభ జీవితం, సేవలో ఆసియా కతోలికులు అందిస్తున్న విశేష సేవను కూడా ఆయన ప్రశంసించారు.

విభిన్న ఖండాలు, భిన్న శ్రీసభ సంప్రదాయాల నుంచి వచ్చినప్పటికీ, ఈ ప్రతినిధులందరూ ఒకే నమ్మకాన్ని వ్యక్తపరిచారు—విభజనలతో కూడిన ప్రపంచంలో శ్రీసభ వారధుల నిర్మాణకర్తగా మారాలి.

వారి సందేశాలు సినడల్ పరివర్తన, వారధుల నిర్మాణం అనే సమావేశ ఇతివృత్తాన్ని మరింత బలపరిచాయి. ఆసియా శ్రీసభ అనుభవం ఈ ఖండానికే కాకుండా, విశ్వవ్యాప్త శ్రీసభకు కూడా అమూల్యమైన వరమని అవి స్పష్టం చేశాయి.