12 వ FABC ప్లీనరీ సమావేశానికి ముందు ఆసియా శ్రీసభ భవిష్యత్ దిశపై FABC అధ్యక్షుని దార్శనికత

Federation of Asian Bishops' Conferences (FABC) అధ్యక్షులు
Federation of Asian Bishops' Conferences (FABC) అధ్యక్షులు, పశ్చిమ భారతదేశంలోని గోవా-దమన్ అగ్రపీఠాధిపతి కార్డినల్ ఫిలిపే నెరి ఫెర్రావో, మరింత సినడల్, సువార్త ప్రకటనా దృక్పథంతో, సంభాషణాత్మక స్వభావం కలిగిన శ్రీసభపై తన దార్శనికతను పంచుకుంటున్నారు.

ఆసియాలోని కతోలిక శ్రీసభ Federation of Asian Bishops' Conferences (FABC) యొక్క XII ప్లీనరీ సమావేశానికి సిద్ధమవుతున్న వేళ, FABC అధ్యక్షులు, పశ్చిమ భారతదేశంలోని గోవా-దమన్ అగ్రపీఠాధిపతి కార్డినల్ ఫిలిపే నెరి ఫెర్రావో సమాఖ్య స్ఫూర్తి, సువార్త ప్రకటనా ఉత్సాహం, సంభాషణాత్మక దృక్పథంతో కూడిన శ్రీసభపై తన దార్శనికతను పంచుకున్నారు.

"సినడల్ స్ఫూర్తికి పిలుపు – ఆసియాలో వారధులు మరియు వారధుల నిర్మాణకర్తలుగా ఉండే శ్రీసభకు పిలుపు" అనే ప్రధాన అంశంతో ఇండోనేషియాలోని జకార్తాలో జూలై 20–26 తేదీల్లో ఈ 12  వ  FABC ప్లీనరీ సమావేశం జరగనుంది.

ఈ సమావేశంలో ఆసియా ఖండంలోని వివిధ దేశాల పీఠాధిపతులు ఒకేచోట సమావేశమై, వేగంగా మారుతున్న సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, మతపరమైన పరిస్థితుల మధ్య శ్రీసభ చేపట్టాల్సిన సేవా బాధ్యతలపై లోతైన విచారణ జరపనున్నారు.

రేడియో వెరితాస్ ఆసియా (RVA)కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కార్డినల్ ఫెర్రావో, ఈ ప్లీనరీ సమావేశం ప్రాముఖ్యత, తన ఆశలు, అలాగే ఆసియాలో శ్రీసభ భవిష్యత్ సేవకు ఇది ఎలా మార్గనిర్దేశం చేయగలదో వివరించారు.

12 వ FABC ప్లీనరీ సమావేశం ప్రధాన అంశం ప్రాముఖ్యత ఏమిటి?

Federation of Asian Bishops' Conferences ప్లీనరీ సమావేశం ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుంది. ఆసియా దేశాల పీఠాధిపతులు ఒకే వేదికపై సమావేశమై, ఒక నిర్దిష్ట అంశంపై లోతైన పరిశీలన జరిపి, ఆసియ శ్రీసభ ఎదుర్కొంటున్న మారుతున్న పరిస్థితులు, సవాళ్లకు శ్రీసభ ఎలా స్పందించాలనే దానిపై విచారణ చేస్తారు.

ఈ సంవత్సరం ప్లీనరీ సమావేశం ప్రధాన అంశం:

"సినడల్ స్ఫూర్తికి పిలుపు – ఆసియాలో వారధులు మరియు వారధుల నిర్మాణకర్తలుగా ఉండే శ్రీసభకు పిలుపు."

ఈ అంశానికి పవిత్ర యోహాను సువార్త 1:50లోని యేసు ప్రభువు వాక్యం —

"నీవు వీటికంటే గొప్ప కార్యాలను చూస్తావు."

— బైబిలు ప్రేరణగా నిలుస్తోంది.

సాంస్కృతిక మార్పులు, వలసలు, ఆర్థిక అసమానతలు, పర్యావరణ సంక్షోభం, మత వైవిధ్యం వంటి వేగంగా మారుతున్న ఆసియా మరియు ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో, ఆసియా శ్రీసభ శాంతి, సామరస్యం, సంభాషణలను పెంపొందించే బాధ్యతను స్వీకరించాలి.

సినడాలిటీ స్ఫూర్తితో శ్రీసభ ప్రజల మధ్య కలయిక, సయోధ్యకు వేదికగా మారుతుంది. ఆశ, ఐక్యతలకు సాక్ష్యమిస్తూ, ఆసియాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, సంస్కృతులు, మతాలు, దేశాల మధ్య బంధాలను బలోపేతం చేసే వారధిగా మరియు వారధుల నిర్మాణకర్తగా ఉండాలన్నదే మా లక్ష్యం.

కార్డినల్ ఫెర్రావో
కార్డినల్ ఫెర్రావో: "ఆసియాలో సినడాలిటీకి ఆచరణాత్మక మార్గదర్శకంగా ఉపయోగపడే XII FABC ప్లీనరీ సమావేశం తుది పత్రాన్ని కూడా రూపొందించాలని మేము యోచిస్తున్నాము."
(ఫోటో: CBCP News)

ఈ ప్లీనరీ సమావేశంపై మీ ఆశలు ఏమిటి?

ఈ ప్లీనరీ సమావేశంలో మేము ప్రధానంగా ఐదు ప్రాధాన్యతలపై దృష్టి సారించనున్నాము.

మొదటిగా, ఆసియా శ్రీసభ జీవితం, సేవ, దాని వైవిధ్యం, అభివృద్ధి, సవాళ్లపై ప్రార్థనాత్మకంగా, విమర్శనాత్మకంగా పరిశీలిస్తాము.

రెండవదిగా, పరస్పర అభిప్రాయాలను ఆలకించడం, సంభాషణల ద్వారా ఆసియా శ్రీసభకు అత్యవసరమైన పాస్టోరల్ ప్రాధాన్యతలను గుర్తించేందుకు ప్రయత్నిస్తాము.

మూడవదిగా, అన్ని పీఠాధిపతుల సమాఖ్యల మధ్య సమర్థమైన సమాచార మార్పిడి, పరస్పర సహకారం, ఉమ్మడి కార్యక్రమాల ద్వారా ఐక్యతను, సహకారాన్ని, వరాల పరస్పర పంచుకోవడాన్ని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము.

నాలుగవదిగా, ఆసియాలోని మత, సాంస్కృతిక వైవిధ్యాన్ని గుర్తిస్తూ, పరస్పర అవగాహనకు వారధులు నిర్మించడం, శాంతి, పరస్పర గౌరవాన్ని పెంపొందించడం, సువార్తకు సాక్ష్యమివ్వడం వంటి మార్గాలను అన్వేషిస్తాము.

చివరిగా, శ్రీసభతో పాటు సమాజం ఎదుర్కొంటున్న అత్యవసర సమస్యలను నిజాయితీగా ఎదుర్కొంటూ, సువార్త ఆధారంగా పాస్టోరల్ సున్నితత్వం, ప్రవక్తల స్పష్టత, ఆచరణాత్మక చర్యలతో స్పందించేందుకు కృషి చేస్తాము.

ఈ ఆశయాలన్నింటినీ పవిత్రాత్మ మార్గదర్శకత్వానికి అప్పగిస్తున్నాము. ఆయనే మమ్మల్ని నడిపిస్తూ, నూతనీకరిస్తూ, మన ఉమ్మడి ప్రయాణానికి కొత్త మార్గాలను తెరుస్తారు.

అలాగే, ఆసియాలో సినడాలిటీకి ఆచరణాత్మక మార్గదర్శిగా ఉపయోగపడే "వాడేమేకం" (Vademecum) రూపంలో 12 వ  FABC ప్లీనరీ సమావేశం తుది పత్రాన్ని కూడా సిద్ధం చేయాలని యోచిస్తున్నాము.

ఆసియాలో శ్రీసభ భవిష్యత్ సేవ, అభివృద్ధికి ఈ ప్లీనరీ సమావేశం ఎలా దోహదపడుతుందని మీరు భావిస్తున్నారు?

ఈ ప్లీనరీ సమావేశం మూడు ముఖ్యమైన మార్గాల్లో ఆసియాలో శ్రీసభ భవిష్యత్ సేవకు, అభివృద్ధికి దోహదపడుతుందని నేను విశ్వసిస్తున్నాను.

మొదటిగా, ఆసియాలోని స్థానిక శ్రీసభల మధ్య సినడాలిటీని మరింత లోతుగా పెంపొందిస్తుంది. పీఠాధిపతులు, గురువులు, కన్యస్త్రీలు, సామాన్య విశ్వాసులు కలిసి ఆలకించడం, భాగస్వామ్యం, ఉమ్మడి విచక్షణ ద్వారా శ్రీసభగా ముందుకు సాగే సినడల్ విధానాన్ని ఇది బలోపేతం చేస్తుంది.

రెండవదిగా, కొత్త పరిస్థితులకు అనుగుణంగా సువార్త ప్రకటనా సేవకు నూతనోత్సాహాన్ని అందిస్తుంది. ఆసియాలో మారుతున్న సామాజిక, సాంస్కృతిక, మతపరమైన పరిస్థితులను లోతుగా పరిశీలిస్తూ, సృజనాత్మకతతో, నూతన ఉత్సాహంతో, సమకాలీన అవసరాలకు అనుగుణంగా శ్రీసభ తన సువార్త ప్రకటనా సేవను మరింత బలోపేతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.

మూడవదిగా, సమాజంలో సంభాషణ, న్యాయం, శాంతిని ప్రోత్సహిస్తుంది. అంతర్మత సంభాషణలో మరింత చురుకైన పాత్ర పోషిస్తూ, శాంతి, న్యాయం, మానవ గౌరవ పరిరక్షణకు శ్రీసభ బలమైన స్వరంగా నిలవడానికి ఇది ప్రోత్సహిస్తుంది. తద్వారా ఆసియాలోని వైవిధ్యభరిత సమాజాల మధ్య క్రైస్తవ విశ్వాసానికి విశ్వసనీయమైన సాక్ష్యంగా నిలిచే అవకాశాన్ని కల్పిస్తుంది.