సిగ్నిస్ ప్రపంచ సదస్సుకు సందేశాన్ని పంపిన పోప్

డిజిటల్ సమాచార ప్రసారం ఎల్లప్పుడూ సత్యాన్ని ప్రతిబింబిస్తూ, ప్రతి వ్యక్తి మానవ గౌరవాన్ని పరిరక్షించే విధంగా ఉండాలని పోప్ లియో పిలుపునిచ్చారు.

రువాండా రాజధాని కిగాలీలో జరుగుతున్న **సిగ్నిస్ ప్రపంచ సదస్సు**లో పాల్గొంటున్న కతోలిక సమాచార మాధ్యమ ప్రతినిధులకు పంపిన సందేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 

పొప్ తరఫున కార్డినల్, వాటికన్ రాష్ట్ర కార్యదర్శి పియాత్రో పరోలిన్ ఈ సందేశాన్ని అందించారు.

ఈ సదస్సులో పాల్గొంటున్న వారందరికీ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన తాను ఆధ్యాత్మికంగా వారితో ఏకమై ఉన్నానని పేర్కొన్నారు. 

డిజిటల్ యుగంలో మన దైనందిన జీవితం ఇంటర్నెట్, సాంకేతిక పరిజ్ఞానాల చుట్టూనే తిరుగుతోందని పోప్ తన సందేశంలో గుర్తుచేశారు. 

తన "మాగ్నిఫికా హ్యూమానిటాస్"ఎన్‌సైక్లికల్‌ను ఉటంకిస్తూ, ఆన్‌లైన్ సమాచార ప్రసారం కేవలం సమాచారాన్ని చేరవేసే సాధనం మాత్రమే కాదని, అది ఒక సంస్కృతిని నిర్మిస్తూ, ప్రజలు ప్రపంచాన్ని చూసే దృక్పథాన్ని, సమాజం యొక్క సామూహిక మనస్సాక్షిని కూడా ప్రభావితం చేస్తుందని వివరించారు.

ఈ నేపథ్యంలో సాంస్కృతిక సామరస్యం మరియు పర్యావరణ శ్రేయస్సు కోసం డిజిటల్ సమాచార ప్రసారం అనే ఈ సదస్సు ప్రధాన అంశాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి మార్గాలను అన్వేషించాలని పోప్ ప్రతినిధులను ప్రోత్సహించారు.

సత్యాన్ని ఆధారంగా చేసుకొని, ప్రతి వ్యక్తి గౌరవాన్ని కాపాడే సమాచార వ్యూహాలు, ఆధునిక డిజిటల్ సాధనాలు అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. 

అలాంటి సమాచార ప్రసారం సువార్త విలువలైన ఐక్యత, శాంతిని పెంపొందించడమే కాకుండా, సృష్టి సంరక్షణ పట్ల బాధ్యతాయుతమైన వైఖరిని కూడా ప్రోత్సహిస్తుందని పోప్  పేర్కొన్నారు.

చివరగా, ఈ సదస్సులో పాల్గొంటున్న వారి సేవలు సమృద్ధిగా ఫలించాలని ప్రార్థిస్తూ, ప్రభువులో జ్ఞానాన్ని, బలాన్ని ప్రసాదించే అపోస్తలిక ఆశీర్వాదాన్ని పోప్ వారికి అందించారు.

Telugu Survey Popup Image