యెమెన్‌ మానవతా సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేసిన పోప్

ఒకవైపు యుద్ధంతో అల్లాడుతున్న యెమెన్ ప్రజలు.. మరోవైపు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జోర్డాన్ క్రైస్తవులు.. ఈ రెండు విషాద ఘటనలపై పోప్ లియో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 

ఊపిరితిత్తుల శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న పోప్ లియో ప్రస్తుతం వాటికన్‌లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో ఆదివారం ప్రార్థన కార్యక్రమాల్లో యథావిధిగా పాల్గొంటున్నారు.

ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితులు, మానవతా సంక్షోభాలపై ఆయన తన దృష్టిని కేంద్రీకరించారు.

ముఖ్యంగా యెమెన్ దేశంలో నెలకొన్న దారుణమైన మానవతా పరిస్థితులపై పోప్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి ప్రజలకు ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు సైతం అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

యుద్ధ చర్యలు తక్షణమే నిలిపివేయాలని నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. యెమెన్ ప్రజలతో పాటు ఈ ప్రాంతంలోని ప్రజలందరికీ శాంతితో జీవించే హక్కు కల్పించాలి అని పోప్ అన్నారు 

ఇదే సందర్భంగా జోర్డాన్‌లోని సెయింట్ జార్జ్ ఆర్థడాక్స్ చర్చిపై జరిగిన ఉగ్రదాడిని కూడా పోప్ తీవ్రంగా ఖండించారు.

ఈ దాడిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో నలభై మంది గాయపడ్డారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న జోర్డాన్ దేశంలో వివిధ మతాల మధ్య శాంతియుత సహజీవనానికి పేరున్న నేపథ్యంలో ఈ ఘటనపై పోప్ విచారం వ్యక్తం చేశారు.

ఈ దాడిలో మరణించినవారికి, గాయపడినవారికి తన ప్రార్థనలు తెలియజేస్తూ.. బాధిత కుటుంబాలకు, చర్చివర్గానికి, యావత్ జోర్డాన్ దేశానికి తన సంఘీభావాన్ని ప్రకటించారు.

యుద్ధాలు లేని ప్రపంచం.. ఆయుధాలు లేని శాంతి.. హృదయాలను మార్చే సయోధ్య.. ఇదే పోప్ లియో ఆకాంక్ష.

 

Telugu Survey Popup Image