సామూహిక దృక్పథం క్రైస్తవుల లక్ష్యం: బిషప్ పిల్లి అంతోనిదాస్
క్రైస్తవులంతా స్వార్థపూరితమైన వ్యక్తివాదం నుండి సహకారపూర్వక సామూహిక దృక్పథానికి మారవలసిన అవసరం ఉందని నెల్లూరు పీఠ సహకాపరి మరియు క్రైస్తవ సమైక్యతా విభాగం అధ్యక్షులు మహా పూజ్య పిల్లి అంతోని దాస్ గారు ఉద్బోధించారు.
ఖమ్మం పీఠాధిపతులు మహా పూజ్య సగిలి ప్రకాష్ గారి ఆహ్వానం మేరకు, భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య సీసీబీఐ క్రైస్తవ సమైక్యతా విభాగం, తెలుగు కతోలిక పీఠాధిపతుల సమాఖ్య (టిసిబిసి) క్రైస్తవ సమైక్యతా విభాగం కలసి ఏర్పాటు చేసిన శిక్షణ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ కార్యక్రమం జూన్ 9, 2026న ఖమ్మం పీఠానికి చెందిన నాయుడుపేటలోని మేత్రాసన పాస్టరల్ సెంటర్‌లో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు జరిగింది. ఖమ్మం పీఠానికి చెందిన గురువులు, మఠవాసులు మరియు సామాన్య ప్రజల కొరకు ఈ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమాలో సుమారు 165 మంది పాల్గొన్నారు.
కార్యక్రమ వివరాలు:
ఖమ్మం పీఠ వికార్ జనరల్ మరియు క్రైస్తవ సమైక్యతా విభాగం మేత్రాసన కోఆర్డినేటర్ మాన్సిగ్నర్ టి. షోరి గారు సభికులకు స్వాగతం పలికారు. పీఠాధిపతులు, గురువులు, మఠవాసులు మరియు సామాన్య ప్రజల ప్రతినిధులతో కలిసి జ్యోతిప్రజ్వలనతో ఈ సదస్సు ప్రారంభించారు.
మహా పూజ్య సగిలి ప్రకాష్ గారు కీలక ఉపన్యాసం చేశారు. సమాజంలో న్యాయం, శాంతి మరియు సామరస్యాన్ని పెంపొందించడంలో క్రైస్తవ ఐక్యత మరియు సంభాషణ ఎంత ముఖ్యమని అని వారు స్పష్టం చేశారు.
సమైక్యతా విభాగం అధ్యక్షులు మహా పూజ్య పిల్లి అంతోని దాస్ గారు సమకాలీన సందర్భంలో నైసియా సభ యొక్క ప్రస్థానం మరియు శాశ్వత ప్రాముఖ్యతపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. వ్యక్తివాదం నుండి సామూహిక దృక్పథానికి మారవలసిన అవసరాన్ని, మరియు విశ్వాసాన్ని మానవ అభివృద్ధి మరియు సేవ యొక్క నిర్దిష్ట చర్యలుగా మార్చవలసిన ఆవశ్యకతను తెలిపారు. అపోహలను అధిగమించడం, మరియు ఉమ్మడి ప్రయోజనం కోసం వివిధ మతాల ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం యొక్క ప్రాముఖ్యతను ఆయన ఉద్ఘాటించారు.
CCBI క్రైస్తవ సమైక్యతా విభాగ కార్యదర్శిగా గురుశ్రీ కె.అంతయ్య గారు పరిచర్యలో ఐక్యత ప్రాముఖ్యత గురించి శ్రీసభ బోధనలను ఉదహరిస్తూ మాట్లాడారు. క్రైస్తవుల మధ్య ఐక్యతను పెంపొందించడానికి మరియు ఇతర మతాల ప్రజలతో సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి చిత్తశుద్ధితో, ఆచరణాత్మక ప్రయత్నాలు చేయాలని ఆయన పాల్గొన్న వారిని ప్రోత్సహించారు.
స్వతంత్ర సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రేస్ సర్వీస్ సొసైటీ బిషప్ జాకబ్ మార్నెని గారు తోటి క్రైస్తవులతో తమ సంబంధాలలో ప్రేమ, త్యాగం, వినయం మరియు సేవ ద్వారా వ్యక్తమయ్యే క్రీస్తు మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలని పాల్గొన్నవారిని కోరారు.
విశ్వలేఖ తెలుగు అనువాదం:
ఈ సదస్సులో పోప్ లియో గారు రాసిన విశ్వ లేఖ 'ఇన్ యూనిటేట్ ఫైడై' తెలుగు అనువాదాన్ని విడుదల చేశారు.దానిని పాల్గొన్న వారందరికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు, సభ జరిగిన తీరు పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇది తమ వ్యక్తిగత జీవితాలకు, పాస్టర్ల పరిచర్యకు సుసంపన్నమైనదిగా మరియు ఫలవంతమైనదిగా అభివర్ణించారు.