ఆసియాలో వారధులను నిర్మించే సంఘం: సంభాషణ, సేవ, సమైక్యతకు పిలుపు
జూలై 20 నుండి 26 వరకు ఇండోనేషియాలోని జకార్తాలో జరగనున్న ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బిషప్స్ కాన్ఫరెన్సెస్ (FABC) ప్లీనరీ అసెంబ్లీ కోసం ఆసియా సంఘం సిద్ధమవుతున్న ఈ సమయంలో, సమావేశం యొక్క ప్రధాన అంశమైన "సినోడల్ పరివర్తన మరియు ఆసియాలో వారధులు నిర్మించేవారిగా ఉండే ప్రేషిత కార్యం" ఎంతో సమయోచితంగా కనిపిస్తోంది.
"వారధులు నిర్మించడం" అనే భావన పోప్ ఫ్రాన్సిస్ బోధనలతో ప్రత్యేకంగా ముడిపడి ఉంది. గోడలు కట్టడం కంటే వంతెనలు నిర్మించాలనే పిలుపును ఆయన పలుమార్లు క్రైస్తవులకు అందించారు. భయం, వెలివేత, విభజన వంటి వాటిపై నిజమైన క్రైస్తవ సాక్ష్యం ఎన్నటికీ నిర్మించబడదని ఆయన స్పష్టం చేశారు.
2024లో ఆయన ఇండోనేషియా పర్యటన ఈ సందేశానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. ఇండోనేషియా సమాజంలో ఎంతో కాలంగా కొనసాగుతున్న పరస్పర సహకార స్ఫూర్తి అయిన "గొటోంగ్ రోయోంగ్ (Gotong Royong)"ను పోప్ ఫ్రాన్సిస్ ప్రశంసించారు. అలాగే జకార్తాలోని ఇస్తిక్లాల్ మసీదు మరియు అవర్ లేడీ ఆఫ్ ది అసంప్షన్ కేథడ్రల్ ను అనుసంధానించే "టన్నెల్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్" ను ప్రస్తావిస్తూ, వేర్వేరు మతాలకు చెందిన ప్రజలు తమ తమ విశ్వాసాలకు నిబద్ధులుగానే ఉంటూనే, అనుమానాలకన్నా సంభాషణను, సహకారాన్ని ఎంచుకోవచ్చనే శక్తివంతమైన ప్రతీకగా పేర్కొన్నారు.
అయితే ఈ దృక్పథం పోప్ ఫ్రాన్సిస్‌తో ప్రారంభమైనది కాదు.
1999లో వెలువడిన "ఎక్లేసియా ఇన్ ఆసియా (Ecclesia in Asia)" అనే అపోస్తలిక ఉపదేశంలో పునీత రెండవ జాన్ పాల్ పోప్, ఆసియా సంస్కృతులు మరియు మతాలతో సంభాషణను "సంఘం యొక్క సువార్త ప్రకటనా కార్యంలో అంతర్భాగం"గా అభివర్ణించారు. ఆసియాలోని గొప్ప ఆధ్యాత్మిక సంప్రదాయాలతో క్రైస్తవులు దృఢ విశ్వాసంతో పాటు గౌరవభావంతో సంభాషించాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే XVI వ బెనెడిక్ట్ పాపు గారు కూడా బలవంతం ద్వారా కాదు, వివేకపూర్వక సంభాషణ ద్వారానే విశ్వాసం వికసిస్తుందని నొక్కి చెప్పారు.
ఈ ముగ్గురు పోప్‌ల బోధనలు ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. వారధులు నిర్మించడం అనేది కేవలం దౌత్యం లేదా ప్రజాసంబంధాల వ్యూహం కాదు; అది సువార్తకు సజీవ వ్యక్తీకరణ.
సంభాషణకు అంకితమైన సంప్రదాయం
1970లో స్థాపించబడినప్పటి నుండి FABC, "త్రివిధ సంభాషణ" (Triple Dialogue) అనే దృక్పథాన్ని ప్రోత్సహిస్తోంది. అవి:
* ఆసియా సంస్కృతులతో సంభాషణ,
* ఆసియాలోని మతాలతో సంభాషణ,
* పేదలతో సంభాషణ.
ఈ దృక్పథం ప్రకారం ఆసియాలో సువార్త ప్రకటనా కార్యం సంస్థాగత బలంపై కాకుండా, పరస్పర విశ్వాసం, గౌరవం, సంఘీభావం వంటి విలువలతో నిర్మితమైన సంబంధాలపై ఆధారపడి ఉంటుంది.
ఆసియాలోని అనేక సంఘ నాయకులు ఈ దృక్పథాన్ని తమ తమ సందర్భాల్లో ఆచరణలో చూపించారు.
థాయ్‌లాండ్‌లో కార్డినల్ మైఖేల్ మిచాయ్ కిట్‌బుంచు బౌద్ధ సమాజాలతో సన్నిహిత సంబంధాలను పెంపొందించారు.
భారతదేశంలో కార్డినల్ ఓస్వాల్డ్ గ్రేసియాస్ వివిధ మతాల మధ్య సంభాషణను నిరంతరం ప్రోత్సహించారు.
ఇండోనేషియాలో కార్డినల్ ఇగ్నేషియస్ సుహార్యో హార్డ్జోఆట్మోడ్జో ఇతర మతాల నాయకులతో కలిసి పనిచేస్తూ, సహకారం మరియు స్వీయ విశ్వాసానికి నిబద్ధత పరస్పర విరుద్ధమైనవి కావని నిరూపించారు.
దక్షిణ కొరియాలో కార్డినల్ స్టీఫెన్ కిమ్ సౌ-హ్వాన్, దేశ ప్రజాస్వామ్య ఉద్యమ కాలంలో నైతిక నాయకుడిగా నిలిచారు. ప్రజాస్వామ్య ఉద్యమకారులకు సంఘ భవనాలను అందుబాటులో ఉంచుతూ, శాంతియుత సంస్కరణలను సమర్థించారు.
ఫిలిప్పీన్స్‌లో కార్డినల్ జైమ్ సిన్, 1986లో జరిగిన పీపుల్ పవర్ విప్లవం శాంతియుత మార్పుకు దారి తీసేలా సంఘం యొక్క నైతిక ప్రభావాన్ని వినియోగించారు. రక్తపాతం సంభవించే ప్రమాదాన్ని తగ్గించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
మలేషియాలో దివంగత కార్డినల్ ఆంథోనీ సోటర్ ఫెర్నాండెజ్ మరో గొప్ప ఉదాహరణ. వివిధ మత, జాతి సమూహాల మధ్య గౌరవం పొందిన ఆయన, సంభాషణను విశ్వాసానికి రాజీగా కాకుండా, విశ్వాసానికి వ్యక్తీకరణగా భావించారు. 1983లో స్థాపించబడిన మలేషియన్ కన్సల్టేటివ్ కౌన్సిల్ ఆఫ్ బౌద్ధిజం, క్రైస్తవం, హిందూమతం, సిక్కు మతం మరియు టావోయిజం (MCCBCHST)లో ఆయన కీలక పాత్ర పోషిస్తూ, దేశంలోని ప్రధాన ముస్లిమేతర మతాల మధ్య పరస్పర అవగాహన, సహకారాన్ని పెంపొందించారు.
మలేషియాలో దివంగత కార్డినల్ ఆంథోనీ సోటర్ ఫెర్నాండెజ్ మరో గొప్ప ఉదాహరణ. వివిధ మత, జాతి సమూహాల మధ్య గౌరవం పొందిన ఆయన, సంభాషణను విశ్వాసానికి రాజీగా కాకుండా, విశ్వాసానికి వ్యక్తీకరణగా భావించారు. 1983లో స్థాపించబడిన మలేషియన్ కన్సల్టేటివ్ కౌన్సిల్ ఆఫ్ బౌద్ధిజం, క్రైస్తవం, హిందూమతం, సిక్కు మతం మరియు టావోయిజం (MCCBCHST)లో ఆయన కీలక పాత్ర పోషిస్తూ, దేశంలోని ప్రధాన ముస్లిమేతర మతాల మధ్య పరస్పర అవగాహన, సహకారాన్ని పెంపొందించారు.
నేడు మయన్మార్‌కు చెందిన కార్డినల్ చార్ల్స్ మౌంగ్ బో సంఘర్షణల మధ్య సమాధానాన్ని పిలుపునిస్తుండగా, కార్డినల్ లూయిస్ ఆంటోనియో టాగ్లే వినడం, వినయం, తోడుగా నడవడం అనే పాస్టోరల్ దృక్పథానికి ప్రతీకగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు.
ఈ నాయకుల పరిస్థితులు వేర్వేరుగా ఉన్నప్పటికీ, వారందరిలోనూ ఒకే విశ్వాసం కనిపిస్తుంది. సంఘం గోడలా నిలబడినప్పుడు కంటే, వంతెనగా మారినప్పుడే తన అత్యంత ప్రభావాన్ని చూపుతుంది.
ప్రతి రోజూ నిర్మించబడుతున్న వారధులు
వారధులను నిర్మించడం అనేది కేవలం అంతర్మత సంభాషణతో మాత్రమే పరిమితం కాదు.
ఆసియా సంఘం యొక్క ఒక విశేష లక్షణం ఏమిటంటే, అనేక దేశాల్లో కతోలికులు అల్పసంఖ్యాకులుగా ఉన్నప్పటికీ, సంఘం ప్రభావం వారి సంఖ్యను మించిపోతుంది.
పాఠశాలలు, ఆసుపత్రులు, సామాజిక సేవా సంస్థలు, దాతృత్వ కార్యక్రమాల ద్వారా మతభేదం లేకుండా అందరికీ సేవ చేయడం వల్ల సంఘం సమాజంలో విశ్వాసాన్ని సంపాదించింది. దీనివల్ల విశ్వసనీయత అనేది సంఖ్యల వల్ల గానీ, రాజకీయ ప్రభావం వల్ల గానీ కాదు; నిబద్ధతతో కూడిన సేవ, నిజాయితీ వల్ల లభిస్తుందని స్పష్టమవుతోంది.
అత్యంత ముఖ్యమైన అనేక వంతెనలను సాధారణ విశ్వాసులే నిర్మిస్తున్నారు. అంతర్మత కార్యక్రమాలను నిర్వహించే విచారం స్వచ్ఛంద సేవకులు, పేదలను ఆదుకునే కన్యస్త్రీలు, భిన్న నేపథ్యాల పిల్లలకు విద్యాబోధన చేసే ఉపాధ్యాయులు, ప్రకృతి వైపరీత్యాల అనంతరం కలిసి పనిచేసే స్థానిక సమాజాలు—ఇవన్నీ వంతెనల నిర్మాణానికి సజీవ ఉదాహరణలు.
ధ్రువీకరణ, అపనమ్మకం పెరుగుతున్న ఈ కాలంలో, సంఘం యొక్క లక్ష్యం భిన్నతలను తొలగించడం కాదు; అవి మానవ గౌరవానికి, పరస్పర గౌరవానికి, శాంతియుత సహజీవనానికి అడ్డంకులుగా మారకుండా చూడడం.
అందుకే FABC ప్రతిపాదిస్తున్న "వారధులు నిర్మాణం"** కేవలం ఒక విశ్వాస వ్యూహం మాత్రమే కాదు. అది తీర్పు చెప్పే ముందు వినే, బోధించే ముందు తోడుగా నడిచే, ఘర్షణకు బదులుగా భేటీని కోరుకునే సంఘ దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది.
జకార్తాలో సమావేశమయ్యే పీఠాధిపతులు ఈ దృక్పథాన్ని మరింత బలపరిస్తే, వారు పునీత రెండవ జాన్ పాల్ పోప్ పాపుగారి సంభాషణకు ఇచ్చిన పిలుపును, పోప్ బెనెడిక్ట్ XVI వివేకపూర్వక చర్చలపై ఉంచిన నమ్మకాన్ని, పోప్ ఫ్రాన్సిస్ సోదరభావానికి చేసిన పిలుపును, అలాగే కార్డినల్స్ స్టీఫెన్ కిమ్ సౌ-హ్వాన్, జైమ్ సిన్, చార్ల్స్ మౌంగ్ బో, లూయిస్ ఆంటోనియో టాగ్లే, ఇగ్నేషియస్ సుహార్యో వంటి ఆసియా సంఘ నాయకులు తమ జీవితం, సేవ ద్వారా చూపించిన సాక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లినవారవుతారు.
వైవిధ్యం ప్రతి రోజు జీవన వాస్తవంగా ఉన్న ఆసియా ఖండంలో, సంఘం యొక్క అత్యంత ప్రవచనాత్మకమైన ప్రేషిత కార్య విభజనలో ఏదో ఒక వైపు నిలబడటం కాదు; లేదా ఇతరులను ఒంటరిగా ఆ విభజన దాటమని కోరడం కాదు. సంభాషణ, వినయం, నిస్వార్థ సేవ ద్వారా ప్రజలను ఒకచోట చేర్చే వంతెనగా మారడమే సంఘం యొక్క నిజమైన పిలుపు.