"వైరల్ కంటే విశ్వసనీయతే ముఖ్యం" — డిజిటల్ మిషన్‌కు కొత్త పిలుపు
"వైరల్ కంటే విశ్వసనీయతే ముఖ్యం" — డిజిటల్ మిషన్‌కు కొత్త పిలుపు
డిజిటల్ సువార్త ప్రచారంలో సహకారాన్ని బలోపేతం చేయడం, ఉమ్మడి దృక్పథాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా నిర్వహించిన మొట్టమొదటి "ఆసియన్ క్యాథలిక్ డిజిటల్ మిషనరీ అసెంబ్లీ 2026" మనీలాలో ముగిసింది. సెప్టెంబర్ 10–13 తేదీలలో ఫిలిప్పీన్స్‌లోని క్వెజోన్ సిటీలో ఉన్న రేడియో వెరితాస్ ఆసియ క్యాంపస్‌లో జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బిషప్స్ కాన్ఫరెన్సెస్ ఆఫీస్ ఆఫ్ సోషల్ కమ్యూనికేషన్ (FABC-OSC) మరియు రేడియో వెరిటాస్ ఆసియా సంయుక్తంగా, వాటికన్ డికాస్టరీ ఫర్ కమ్యూనికేషన్ త్రూ ది ఫుల్లీ ప్రెజెంట్ నెట్‌వర్క్‌తో భాగస్వామ్యంతో నిర్వహించాయి.
పరిశుద్ధ లియో XIV పాపు గారు, కార్డినల్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ పీట్రో పరోలిన్ సంతకంతో ఒక సందేశాన్ని పంపారు, అందులో పాల్గొనేవారిని "వారి డిజిటల్ కంటెంట్‌లో యేసు క్రీస్తుకు ప్రామాణిక సాక్షులుగా ఎదగమని" ప్రోత్సహించారు.
ఆసియా వ్యాప్తంగా 100 మందికి పైగా డిజిటల్ మిషనరీలు, ప్రచారకులు, కంటెంట్ సృష్టికర్తలు ఈ అసెంబ్లీలో పాల్గొని, డిజిటల్ ప్రపంచంలో సువార్తను మరింత సమర్థవంతంగా ప్రకటించేందుకు తమ అనుభవాలను, ఆలోచనలను పంచుకున్నారు.మన తెలుగు విభాగం నుండి ఇన్‌ఫ్లుయెన్సర్లు " శ్రీ సృజన్ సెగావ్" మరియు "శ్రీ సాగర్ గబ్బెట"లు ఈ "ఆసియన్ క్యాథలిక్ డిజిటల్ మిషనరీ అసెంబ్లీ 2026" లో పాల్గొన్నారు.
కార్డినల్ మహా పూజ్య లూయిస్ ఆంటోనియో టాగ్లే గారు ఆసియా డిజిటల్ మిషనరీలకు, తమ ఆన్‌లైన్ ప్రభావం కేవలం పోస్టులు, ఫాలోవర్లు, వైరల్ కంటెంట్ వరకు పరిమితం కాకుండా క్రీస్తుకు నిజమైన సాక్ష్యంగా మారాలని పిలుపునిచ్చారు. ఆయన ముఖ్యంగా “మిమ్మల్ని ఎవరు ప్రభావితం చేస్తున్నారు?” అనే ప్రశ్నను డిజిటల్ మిషనరీలు తమను తాము వేసుకోవాలని సూచించారు.
"ఆసియన్ క్యాథలిక్ డిజిటల్ మిషనరీ అసెంబ్లీ 2026" ముగింపు కార్యక్రమంలో భాగంగా ఆదివారం జరిగిన ముగింపు ప్రార్థనలకు కలూకాన్ బిషప్ కార్డినల్ మహా పూజ్య పాబ్లో వర్జిలియో డేవిడ్ గారు అధ్యక్షత వహించారు.
ఇంటర్నెట్ కోట్లాది మందిని కలుపుతున్నప్పటికీ, అదే సమయంలో వారిని ఒంటరితనంలోకి నెట్టగలదని, అల్గారిథమ్స్ ప్రజలను ఒకే ఆలోచనా సమూహాల్లోకి చేర్చి విభజనకు కూడా దారితీయగలవని కార్డినల్ డేవిడ్ గారు హెచ్చరించారు. అందువల్ల డిజిటల్ మిషనరీలు “ఇతరులు కోపాన్ని వ్యాపింపజేసినప్పుడు, ధైర్యంతో జవాబివ్వండి,” అని , “ఇతరులు అవమానాన్ని వ్యాపింపజేసినప్పుడు, గౌరవంతో జవాబివ్వండి అని అన్నారు. “ఇతరులు తలుపులు మూసినప్పుడు, మీరు ఒక వంతెనగా మారండి” అనే ఆయన పిలుపు, డిజిటల్ మిషన్‌ను కేవలం కంటెంట్ ప్రచారం నుంచి నిజమైన క్రైస్తవ సాక్ష్యంగా మార్చే దిశను సూచించింది.
Article and Design By M Kranthi Swaroop
