"ఉన్నది ఒక్కటే జిందగీ .. ఊపిరి ఉన్నప్పుడే ఏదైనా చేయాలి"

గుర్తుండిపోయే క్షణాలు.. గుండెను తడిపే లక్షణాలు..

కాలం ఒక నిరంతర ప్రవాహం .. అది సాగిపోతూనే ఉంటుంది..దానిని నిలపలేం, వెనక్కి లాగలేం.. దాని వెంట పరిగెత్తడమే..

యవ్వనం ఒక వరం.. లక్ష్యాన్ని సాధించడానికి ఒక మంచి తరుణం.. కరిగిపోయిన, తరిగిపోయిన యవ్వనాన్ని తిరిగి తెచ్చుకోవడం అసాధ్యం..

యవ్వనకాలాన్ని సక్రమంగా ఉపయోగిస్తే సమాజ పురోభివృద్ధిలో భాగస్వాములమవుతాం.. అక్రమంగా ఉపయోగిస్తే అసాంఘిక శక్తులుగా పతనమవుతాం.. 

ఈ విషయాన్ని గట్టిగా విశ్వసించే వారిలో మా  కతోలిక  యువతది ప్రథమస్థానం..

ఎప్పుడో దశాబ్ధం క్రితం

'కర్నూలు మేత్రాసన కతోలిక యువత'గా అందరం ఒక కుటుంబంగా కలిసాం.. నాటి నుంచి నేటి వరకు సమసమాజ స్థాపనలో, నవసమాజ నిర్మాణంలో మా వంతు పాత్ర పోషిస్తూనే ఉన్నాం.. క్రీస్తు సాక్షులుగా ముందుకు సాగుతున్నాం.. 

కర్నూలులో మరియు కర్నూలు నగర శివారులో ఉండే మిషనరీస్ ఆఫ్ చారిటీ, శాంతినికేతన్ కేర్ అండ్ సపోర్ట్ సెంటర్, అభయగిరి అనాథాశ్రమాలలో మా వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 

ఈ జూన్ ఫస్ట్ కి అందరికీ సెలవులు దొరికాయి. అందరం కలిసి ఏదైనా మంచి పని చేయాలనుకున్నాం.. తెలుగు రాష్ట్రాల క్యాథలిక్ యూత్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పసల ఆరోగ్య కిరణ్(డిప్యూటీ తహశీల్దార్, గుంటూరు), మాజీ అధికార ప్రతినిధి మధు(జర్నలిస్ట్, సాక్షి), డయాసిస్ మాజీ అధ్యక్షులు పి. దీపక్(బిజినెస్ మ్యాన్), అందరికీ తలలో నాలుకలా వ్యవహరించే రాజేష్(టీచర్), USA సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్న మణిదీప్, రవి(ప్రైవేట్ ఉద్యోగి), సుచరిత, సుష్మ(టీచర్), సంతోష్,  కలసి మిషనరీస్ ఆఫ్ చారిటీ, అభయగిరి హోం, గార్గేయ పురంలోని మరియానిలయంలకు వెళ్లి వాళ్ల అవసరాలు కనుక్కున్నాం. 

రాష్ట్ర వ్యాప్తంగా ఉండే క్యాథలిక్ యూత్ కి ఫోన్, సోషల్ మీడియా ద్వారా సమాచారమందించాం. అంతే తలా ఒక చెయ్యేశారు.. దాదాపు ₹ 40,000 దాకా చందాలిచ్చారు.. అంతా కలిపి అనాథలు, అభాగ్యులు, పేదలకు పాదరక్షలు, ఫ్యాన్లు, బెడ్ షీట్లు అందజేశాం.. తెరవెనుక నిలబడి కార్యక్రమాన్ని అంతా నడిపించింది మాత్రం కర్నూలు డయాసిస్ మాజీ యూత్ డైరెక్టర్, దివ్యవాణి ఆధ్యాత్మిక ఛానల్ కో ఆర్డినేటర్, అమృతవాణి డైరెక్టర్ అందరికీ సుపరిచితుడు ఫాదర్ పప్పుల సుధాకర్ గారు ..

ఆ అభాగ్యుల కళ్లల్లో ఆనందం చూశాక.. లైఫ్ మళ్లీ రీచార్జ్ అయినట్లైంది.. మేముకూడా వాళ్లను ఆత్మీయులగా భావించాం.. అందుకే మాలో ఆ ఉద్వేగ పూరిత క్షణాలు చిరస్థాయిగా గుర్తుండి పోయాయి..

ఇప్పుడు మా జీవితాల్లో ఒక క్రిస్మస్, ఒక న్యూయర్, ఒక ఈస్టర్ కలిసి వచ్చిన ఒక పేద్ద పండుగను తలపించింది.. మళ్లీ రేపటి నుంచి మా పనుల్లో మేము బిజీ.. 

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా గొప్పలు చూపించుకోవడానికి మాత్రం కాదు.. మరో పదిమంది స్ఫూర్తిని పొందుతారని.. 

"ఉన్నది ఒక్కటే జిందగీ .. ఊపిరి ఉన్నప్పుడే ఏదైనా చేయాలి"

మీ..
మధు.ఎం