పోప్ లియోకు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స విజయవంతం!
పోప్ లియోకు మంగళవారం అక్టోబర్ 13 మధ్యాహ్నం జెమెల్లి ఆసుపత్రిలో ముందుగా నిర్ణయించిన ప్రకారం ఛాతీ సంబంధిత శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు వాటికన్ ప్రెస్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో వైద్యులు డాక్టర్ లుయిగి కార్బోనే, ప్రొఫెసర్ స్టెఫానో మార్గరిటోరా వెల్లడించారు.
ఈ శస్త్రచికిత్సలో భాగంగా పోప్ ఊపిరితిత్తులోని దిగువ భాగాన్ని వైద్యులు తొలగించారు. పూర్తిస్థాయిలో వ్యాధిగ్రస్త కణజాలాన్ని తొలగించేందుకు వీడియో సహాయక పద్ధతిని ఉపయోగించినట్లు వైద్యులు తెలిపారు.
శస్త్రచికిత్సకు ముందు నిర్వహించిన పరీక్షల ద్వారా అనుమానించిన వ్యాధి నిర్ధారణను, ఆపరేషన్ సమయంలో సేకరించిన కణజాల పరీక్షలు కూడా ధృవీకరించాయి.
పోప్కు ఊపిరితిత్తుల అడెనోకార్సినోమా అనే క్యాన్సర్ ఉన్నట్లు శస్త్రచికిత్స సమయంలో నిర్వహించిన కణజాల పరీక్షలో నిర్ధారణ అయిందని వైద్యులు పేర్కొన్నారు.
పోప్ సుమారు మూడు గంటల పాటు ఆపరేషన్ గదిలో ఉన్నారు. అయితే, ఈ శస్త్రచికిత్స దాదాపు 90 నిమిషాల పాటు కొనసాగింది. ఈ ఆపరేషన్ విజయవంతమైందని, ఎటువంటి సమస్యలు తలెత్తలేదని వైద్య బృందం వెల్లడించింది.
శస్త్రచికిత్స అనంతరం పోప్ సహజంగానే మేల్కొన్నారు. కొద్దిసేపు వైద్యుల పర్యవేక్షణలో ఉంచిన తరువాత, ఆసుపత్రిలోని పదవ అంతస్తులో ఉన్న తన గదికి తిరిగి వెళ్లారు.
ఈ శస్త్రచికిత్సకు ప్రొఫెసర్ స్టెఫానో మార్గరిటోరా నాయకత్వం వహించారు.
శస్త్రచికిత్సలో తొలగించిన కణజాలపై రాబోయే రోజుల్లో మరిన్ని పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే, శస్త్రచికిత్సకు ముందు చేసిన పరీక్షల ఆధారంగానే వైద్యులు ఆపరేషన్ చేయాల్సిన ప్రాంతాన్ని, అనుసరించాల్సిన విధానాన్ని నిర్ణయించారు.
పోప్ ఆసుపత్రిలో సుమారు ఒక వారం రోజుల పాటు ఉండనున్నట్లు గతంలో ప్రకటించిన వ్యవధిలో ఎటువంటి మార్పు లేదని సమాచారం
