పాకిస్తాన్ చర్చి సింధ్ వరద బాధితుల కోసం బదీన్ జిల్లాలో 50 ఇళ్ల నిర్మాణం
ఐదుగురు పిల్లల తల్లి మోనికా వాగోకు, వర్షం శబ్దం అంటే ఒకప్పుడు భయంకరమైన అనుభూతి. పాకిస్తాన్ దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లోని బదీన్ జిల్లా తక్కువ ఎత్తులో ఉన్న మైదాన ప్రాంతాల్లో, మబ్బులు కమ్ముకుంటే అది కేవలం వర్షం సంకేతం కాదు; అక్కడ ఉన్న ప్రతి దాని ముగింపుకు సంకేతం. దశాబ్దాలుగా, అక్కడి జీవితం “కచ్చా” (మట్టి) ఇళ్ల అస్థిరతతో మరియు సీజనల్ పనుల అనిశ్చితితో సాగింది. దేశవ్యాప్తంగా వేలాది మందిలాగే, మోనికా కుటుంబం కూడా తరచూ వలసలు వెళ్లాల్సి వచ్చి, తక్కువ రక్షణ కలిగిన మట్టి, చెక్క ఇళ్లలో నివసిస్తూ, వాతావరణ మార్పుల తీవ్ర ప్రభావాల మధ్య జీవనం గడిపింది.
కానీ ఇప్పుడు ఆ భయం బలమైన ఇటుకల ఇళ్లతో మరియు నిరంతర విద్యుత్ సరఫరాతో మారిపోయింది. హైదరాబాదు మేత్రాసనం ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల పునరుద్ధరణ ప్రయాణం అనంతరం, 2022 వరదల వల్ల ఏర్పడిన మట్టిలో నుండి ఒక కొత్త మోడల్ గ్రామం రూపుదిద్దుకుంది.
2025 డిసెంబర్లో పూర్తయిన “Recovery and Rehabilitation of Flood 2022 Affected Communities Vulnerable to Climate Change” అనే ప్రాజెక్ట్ ద్వారా, పాకిస్తాన్ గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత వెనుకబడిన 50 క్రైస్తవ కుటుంబాలకు శాశ్వత, విపత్తులకు తట్టుకునే ఇళ్లు అధికారికంగా అందజేయబడ్డాయి.
పాకిస్తాన్లో వాతావరణ మార్పులకు అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో ఒకటైన బదీన్ జిల్లా, 2022 మాన్సూన్ కాలంలో తీవ్ర నష్టాన్ని చవిచూసింది. ఆ సమయంలో సింధ్ ప్రావిన్స్ సాధారణం కంటే సుమారు 426% ఎక్కువ వర్షపాతం పొందింది. ఈ విపత్తు కారణంగా 1.7 మిలియన్ హెక్టార్ల వ్యవసాయ భూమి మునిగిపోయి, దేశవ్యాప్తంగా 20 లక్షలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. బదీన్లో నెలల తరబడి నిలిచిన నీరు వరి, పత్తి పంటలను నాశనం చేసి, వేలాది పశువుల మరణానికి దారితీసింది.
ఫిబ్రవరి 16న ఈ ఇళ్లను అందజేసే కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో గురువులు, కన్యస్త్రీలు మరియు విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ ప్రాజెక్ట్‌ను ముందుండి నడిపించిన పీఠాధిపతి మహా పూజ్య సామ్సన్ శుకార్డిన్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం వెనుక ఉన్నది పేదల పట్ల గాఢమైన ఆధ్యాత్మిక బాధ్యత అని తెలిపారు.
“మన ప్రజలు ఊహించలేని కష్టాలను అనుభవించారు. ప్రతి వర్షం వారి కోసం ఒక భయం, తమ పిల్లలను కాపాడుకోవడం కోసం వారు పోరాడాల్సి వచ్చింది,” అని ఆయన అన్నారు. “ఈ గ్రామం కేవలం ఇళ్ల సముదాయం కాదు; ఇది కుటుంబాలు ప్రశాంతంగా నిద్రపోయే ఆశ్రయం. మనం కేవలం గోడలను కట్టడం కాదు; వాతావరణ మార్పుల వల్ల వెనుకబడిపోయిన మన సహోదరుల గౌరవాన్ని తిరిగి నిర్మిస్తున్నాం.”
ఈ గ్రామంలో నిర్మించిన మౌలిక వసతులు దీర్ఘకాలిక స్థిరత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. గతంలోని మట్టి ఇళ్లకు భిన్నంగా, ఈ 50 ఇళ్లు ఒక్కొక్కటి 6 నుంచి 8 మంది కుటుంబ సభ్యులకు సరిపడేలా నిర్మించబడ్డాయి మరియు భవిష్యత్ ప్రకృతి విపత్తులను తట్టుకునేలా రూపకల్పన చేయబడ్డాయి. గ్రామంలో త్రాగునీటి కోసం నాలుగు హ్యాండ్పంపులు, శుభ్రత సదుపాయాలు మరియు సామాజిక సమావేశాలు, వృత్తి శిక్షణ కోసం ఒక మల్టీపర్పస్ హాల్ కూడా ఏర్పాటు చేయబడింది.
“మన లక్ష్యం కేవలం ఇళ్ల నిర్మాణం కాదు,” అని పీఠాధిపతులవారు పేర్కొన్నారు. “మహిళలకు శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని శక్తివంతం చేయాలని, పిల్లలకు భద్రమైన వాతావరణం కల్పించాలని మేము ఆశిస్తున్నాం. మేము జీవితాలను నిర్మిస్తూ, యువత భవిష్యత్తును భద్రపరుస్తున్నాం.”
ఈ గ్రామంలో జీవనోపాధి అవకాశాలను కూడా కల్పించారు. ఏడు కుటుంబాలకు చిన్న దుకాణాలను ఇచ్చి, సీజనల్ వ్యవసాయ పనులపై ఆధారపడకుండా స్వయం ఉపాధి పొందేలా చేశారు.
“నిజమైన పునరుద్ధరణ అంటే ఒక వ్యక్తి తన కుటుంబాన్ని గౌరవంతో పోషించుకునే సామర్థ్యం కల్పించడం,” అని ఆయన తెలిపారు. “స్థిరమైన ఇళ్లు మరియు వ్యాపార అవకాశాలు కల్పించడం ద్వారా, ఈ కుటుంబాలు సహజ విపత్తుల బాధితులుగా కాకుండా సమాజానికి తోడ్పడే సభ్యులుగా మారుతున్నారు.”
ఈ ప్రాజెక్ట్‌కు స్థానిక ప్రభుత్వ నిధులు లేకపోయినా, అంతర్జాతీయ చర్చి భాగస్వామ్యంతో ఇది విజయవంతమైంది. Missio, Vision Teilen, Missionszentrale der Franziskaner, మరియు Aid to the Church in Need (ACN) వంటి సంస్థల మద్దతుతో, మేత్రాసనం తమ స్వంత భూమిలో (సెయింట్ జోసెఫ్ విచారణ) ఈ ప్రాజెక్ట్‌ను సమర్థవంతంగా అమలు చేసింది.
చర్చి సేవ వల్ల ఈ సమాజానికి ఒక కొత్త జీవితావకాశం లభించింది.
“ఈ రోజు నా భుజాలపై ఉన్న భారంలా అనిపించినది తొలగిపోయింది,” అని తన కొత్త ఇంటి ముందు నిలబడి మోనికా వాగో భావోద్వేగంగా అన్నారు. “ఇది మా కోసం ఒక కొత్త ప్రారంభం. మమ్మల్ని ఎవరూ మర్చిపోలేదని ఇది నిరూపిస్తోంది.”