హృదయ పరివర్తనతోనే సినడాలిటీ ప్రారంభమవుతుంది; కొత్త చట్టాలతో కాదు: కార్డినల్ మారియో గ్రెక్
కతోలిక శ్రీసభలో సినడాలిటీ భవిష్యత్తు కానన్ చట్టాల్లో మార్పులతో కాకుండా, ముందుగా హృదయ పరివర్తనతో ప్రారంభమవుతుందని పీఠాధిపతుల సినడ్ ప్రధాన కార్యదర్శి కార్డినల్ మారియో గ్రెక్ తెలిపారు.
Federation of Asian Bishops' Conferences (FABC) 12వ ప్లీనరీ సమావేశం సందర్భంగా జూలై 24న జకార్తాలోని హోటల్ ములియా మీడియా కేంద్రంలో జరిగిన రెండో విలేకరుల సమావేశంలో, సినడాలిటీపై సినడ్ ఫలితాలు భవిష్యత్తులో శ్రీసభ న్యాయవ్యవస్థలో భాగమవుతాయా అనే ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సినడల్ ప్రక్రియ ఫలితంగా కానన్ చట్టాల్లో కొన్ని మార్పులు రావచ్చని అంగీకరించినప్పటికీ, నిజమైన నవీకరణ సువార్తతో ప్రారంభమై మానవ హృదయ పరివర్తన ద్వారా సాకారమవుతుందని కార్డినల్ గ్రెక్ స్పష్టం చేశారు.
"మారాల్సింది కేవలం మన వైఖరి కాదు; మన హృదయం. ఇది పత్రాల విషయం కాదు. మనకు మరిన్ని పత్రాలు అవసరం లేదు. మనకు ఇప్పటికే ఒక మౌలిక పత్రం ఉంది—అదే సువార్త," అని ఆయన అన్నారు.
ఈ వ్యాఖ్యలు, పరిశుద్ధ పిత ఫ్రాన్సిస్ 2021లో ప్రారంభించిన సినడాలిటీపై సినడ్ ప్రధాన సందేశాలలో ఒకదానిని ప్రతిబింబించాయి. ప్రస్తుతం అమలు దశలో ఉన్న ఈ ప్రక్రియ, ప్రపంచవ్యాప్తంగా స్థానిక శ్రీసభలు ఆలకింపు, ఆధ్యాత్మిక విచక్షణ, ఉమ్మడి బాధ్యత ద్వారా సంఘబంధం, భాగస్వామ్యం, సేవలను మరింత లోతుగా జీవించాలని పిలుపునిస్తోంది.
సినడాలిటీ, శ్రీసభ చట్టాల మధ్య ఉన్న సంబంధంపై వ్యక్తమైన సందేహాలకు స్పందిస్తూ, ఆధ్యాత్మిక నవీకరణకు, నిర్మాణాత్మక సంస్కరణలకు మధ్య స్పష్టమైన తేడాను కార్డినల్ గ్రెక్ వివరించారు.
శ్రీసభ జీవితంలో నిర్మాణాలు, న్యాయ నిబంధనలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అంగీకరించినప్పటికీ, అవే శ్రీసభ నవీకరణకు ప్రారంభ బిందువుగా మారకూడదని ఆయన స్పష్టం చేశారు.
"ముందుగా సువార్త రావాలి," అని ఆయన పేర్కొంటూ, హృదయాలు పరివర్తన చెందిన తరువాత మాత్రమే నిర్మాణాలు సినడల్ జీవన విధానానికి సమర్థవంతంగా తోడ్పడగలవని వివరించారు.
సినడాలిటీని పెంపొందించడానికి శ్రీసభలో ఇప్పటికే అనేక నిర్మాణాలు ఉన్నాయని కార్డినల్ గ్రెక్ గుర్తుచేశారు. విచారణ సమితులు, మేత్రాసన సేవాపర సమితులు, గురువుల మండళ్లు, సంప్రదింపుదారుల మండళ్లు, మేత్రాసన సినడ్లు, పీఠాధిపతుల సమాఖ్యలు, ఇతర సంప్రదింపుల సంస్థలు అందులో భాగమని ఆయన తెలిపారు.
కొత్త సంస్థలను ఏర్పాటు చేయడం కంటే, ఇప్పటికే ఉన్న ఈ నిర్మాణాలకు సంఘబంధం, భాగస్వామ్యం, సేవ అనే సినడల్ స్ఫూర్తిని నింపి వాటిని మరింత సమర్థవంతంగా వినియోగించడమే అసలు సవాలని ఆయన సూచించారు.
అదే సమయంలో, సినడల్ ప్రక్రియ కానన్ చట్టాల్లో సాధ్యమైన మార్పులపై కూడా గంభీరమైన పరిశీలనకు దారితీసిందని కార్డినల్ గ్రెక్ వెల్లడించారు.
పరిశుద్ధ పాపు గారి అనుమతితో సినడ్ సమయంలో ఇద్దరు కానన్ న్యాయ నిపుణుల కమిషన్లను ఏర్పాటు చేశామని, వాటిలో ఒకటి లాటిన్ శ్రీసభ కోసం, మరొకటి ప్రాచ్య కతోలిక శ్రీసభల అవసరాల కోసం పనిచేశాయని ఆయన తెలిపారు.
లాటిన్ శ్రీసభకు సంబంధించిన కమిషన్ తన పనిని ఇప్పటికే పూర్తి చేసిందని, ప్రాచ్య కతోలిక శ్రీసభల కమిషన్ తన నివేదికను తుది దశలో సిద్ధం చేస్తోందని ఆయన వెల్లడించారు.
"పత్రాలు పూర్తయిన తరువాత అవి సంబంధిత డికాస్టరీలకు, పరిశుద్ధ పాపు గారికి సమర్పించబడతాయని, ఆ తరువాత ఎలాంటి మార్పులు వస్తాయో మనం చూస్తాం," అని ఆయన చెప్పారు.
అయినప్పటికీ, భవిష్యత్తులో వచ్చే ఏ న్యాయపరమైన సంస్కరణలైనా శ్రీసభ లోతైన ఆధ్యాత్మిక నవీకరణకు సేవ చేయాల్సిందే తప్ప, దానికి ప్రత్యామ్నాయంగా మారకూడదని కార్డినల్ గ్రెక్ నొక్కిచెప్పారు.
ప్రపంచవ్యాప్త సినడల్ ప్రక్రియలో ఆయన నిరంతరం ఒక విషయాన్ని పునరుద్ఘాటిస్తున్నారని గుర్తుచేశారు. సమితులు, సమావేశాలు, కానన్ నిబంధనలు మాత్రమే సినడల్ శ్రీసభను నిర్మించలేవని, సువార్తను హృదయపూర్వకంగా స్వీకరించి, విశ్వాసంలో కలిసి నడవడానికి సిద్ధమైన విశ్వాసుల ద్వారా మాత్రమే ఆ నిర్మాణాలు ఫలవంతంగా మారుతాయని అన్నారు.
సినడాలిటీపై సినడ్ అమలు కొనసాగుతున్న ఈ సమయంలో, శాశ్వతమైన నవీకరణ చట్టాల ద్వారా కాకుండా, క్రీస్తు చేత పరివర్తన పొందిన హృదయాల ద్వారా వస్తుందని కార్డినల్ గ్రెక్ పేర్కొన్నారు. అలాంటి పరివర్తన చెందిన విశ్వాసుల ద్వారానే చట్టాలు, నిర్మాణాలు శ్రీసభ సంఘబంధం, భాగస్వామ్యం, సువార్త ప్రచార సేవలను నిజమైన అర్థంలో బలోపేతం చేయగలవని ఆయన తెలిపారు.