సినడాలిటీ అనేది మరో కార్యక్రమం కాదు; అది శ్రీసభ జీవన విధానం: FABC అధికారి
ఆసియాలో సినడాలిటీ బలంగా వేళ్లూనుకోవాలంటే, దానిని మరో సేవాపర కార్యక్రమంగా కాకుండా, శ్రీసభ జీవించే విధానాన్ని, ఆలకించే తీరును, తన సేవను నిర్వహించే పద్ధతిని మారుస్తున్న జీవన విధానంగా స్వీకరించాలని Federation of Asian Bishops' Conferences (FABC) అసోసియేట్ కార్యదర్శి, FABC Office of Synodality కార్యనిర్వాహక కార్యదర్శి గురుశ్రీ క్లారెన్స్ దేవదాస్ అన్నారు.
జూలై 24న జకార్తాలోని హోటల్ ములియాలోని లియాట్రిస్ మీడియా హాల్లో జరిగిన FABC 12వ ప్లీనరీ సమావేశం రెండో విలేకరుల సమావేశంలో కార్డినల్ మారియో గ్రెక్, కార్డినల్ పాబ్లో వర్జిలియో ఎస్. డేవిడ్, కార్డినల్ ఇగ్నేషియస్ సుహార్యో మీడియాతో మాట్లాడకముందు గురుశ్రీ దేవదాస్ తన ప్రారంభ సందేశాన్ని అందించారు.
సినడాలిటీపై సినడ్ ఇప్పుడు అమలు దశలోకి ప్రవేశించిందని గుర్తుచేస్తూ, ప్రతి స్థానిక శ్రీసభ సినడాలిటీని తాత్కాలిక ప్రాజెక్టుగా కాకుండా, తన సాధారణ జీవన విధానంలో అంతర్భాగంగా చేసుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
ఆసియాలో శ్రీసభ ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావిస్తూ, సినడాలిటీని ఇప్పటికే ఉన్న సేవాపర కార్యక్రమాలకు అదనంగా చేర్చాల్సిన మరో కార్యక్రమంగా భావించడం అతిపెద్ద అడ్డంకులలో ఒకటని గురుశ్రీ దేవదాస్ అన్నారు.
"చాలామంది సినడాలిటీని ఇంకో కార్యక్రమం, ఇంకో కార్యకలాపంగా భావిస్తున్నారు. కానీ సినడాలిటీ అంటే కొత్త పనులను చేర్చడం కాదు. మనం ఇప్పటికే చేస్తున్న పనులను భిన్నమైన విధానంలో చేయడమే," అని ఆయన వివరించారు.
ఇప్పటికే అనేక గురువులు, సేవాపర కార్యకర్తలు తమ బాధ్యతలతో అలసిపోయి ఉన్నారని ఆయన అంగీకరించారు.
"‘మీరు మాకు ఇంకో పని ఇస్తున్నారు’ అని గురువులు చెప్పిన సందర్భాలు నేను విన్నాను," అని ఆయన అన్నారు.
అయితే తన సమాధానం ఎప్పుడూ ఒకటేనని, సినడాలిటీ అదనపు భారమేమీ కాదని, ఆలకింపు, ఆధ్యాత్మిక విచక్షణ, భాగస్వామ్యం, ఉమ్మడి బాధ్యతల ద్వారా శ్రీసభ సేవను నిర్వహించే కొత్త విధానమని ఆయన స్పష్టం చేశారు.
ప్రపంచంలోనే అతిపెద్దదిగా, అత్యంత సాంస్కృతిక వైవిధ్యంతో కూడిన ఖండమైన ఆసియాలో సినడాలిటీని అమలు చేయడంలో ఉన్న ప్రత్యేక సవాళ్లను కూడా గురుశ్రీ దేవదాస్ ప్రస్తావించారు.
"సినడాలిటీ" అనే పదాన్నే స్థానిక భాషల్లోకి అనువదించడం కూడా కొన్ని సందర్భాల్లో కష్టసాధ్యమని ఆయన పేర్కొన్నారు.
"సినడాలిటీ అంటే ఏమిటో అందరికీ తెలుసన్న భావన ఉంది. కానీ ఇంగ్లీషు మాట్లాడని ఆసియాలోని దూర ప్రాంతాలకు వెళితే, ఆ భావనను ఎలా అనువదిస్తారు?" అని ఆయన ప్రశ్నించారు.
ఆసియాలోని సాంస్కృతిక, భాషా, సామాజిక వైవిధ్యం కారణంగా, అన్ని ప్రాంతాలకు వర్తించే ఒకే అమలు నమూనా ఉండదని ఆయన వివరించారు.
"ఆసియాలోని అన్ని శ్రీసభల సమస్యలకు ఒకే పరిష్కారం ఉండదు. ప్రతి స్థానిక శ్రీసభ తన సందర్భానికి అనుగుణంగా సినడాలిటీ ఎలా ఉండాలో ఆధ్యాత్మిక విచక్షణతో గుర్తించాలి," అని ఆయన చెప్పారు.
గురుశ్రీ దేవదాస్ అభిప్రాయం ప్రకారం, అసలు సమస్య భాష కాదు; ఆధ్యాత్మికత.
సినడాలిటీతో పాటు నిజమైన ఆధ్యాత్మిక పరివర్తన కూడా అవసరమని ఆయన అన్నారు. మలయ్, ఇండోనేషియా భాషల్లో ఉపయోగించే "కెరోహానియన్" (kerohanian) అనే పదాన్ని ప్రస్తావిస్తూ, సినడాలిటీ కేవలం ఒక ప్రక్రియ లేదా పద్ధతి కాకుండా, శ్రీసభ జీవించే విధానంగా మారాలని ఆయన వివరించారు.
"సినడాలిటీ కేవలం ఒక ప్రక్రియగానే మిగిలిపోతే, చివరికి ప్రజలు 'ఇక తర్వాత ఏమిటి?' అని అడుగుతారు. కానీ అది ఆధ్యాత్మికతగా మారితే, ప్రతిరోజూ మనం జీవించే విధానాన్నే అది మలుస్తుంది," అని ఆయన అన్నారు.
ఆ ఆధ్యాత్మికత విచారణ సమితులు, ఆర్థిక మండళ్లు, మేత్రాసన సమావేశాలు, విచారణ సేవలు, రోజువారీ నిర్ణయాల వరకు శ్రీసభ జీవితంలోని ప్రతి అంశానికి జీవం పోయాలని ఆయన పేర్కొన్నారు.
FABC ప్లీనరీ సమావేశమంతటా ప్రతినిధులు పదేపదే ఒక విషయాన్ని నొక్కిచెప్పారని గురుశ్రీ దేవదాస్ గుర్తుచేశారు. సినడల్ పరివర్తన అనేది కేవలం సంస్థాగత మార్పులకు మాత్రమే పరిమితం కాదని, శ్రీసభ తన ప్రస్తుత నిర్మాణాలను కొనసాగించే స్థితి నుంచి మరింత సువార్త ప్రచార శ్రీసభగా మారాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
"మనం నిర్వహణకే పరిమితమైన శ్రీసభ నుంచి, బయటకు వెళ్లే సువార్త ప్రచార శ్రీసభగా మారాలి," అని ఆయన పిలుపునిచ్చారు.
ఇలాంటి నవీకరణ శ్రీసభ గొప్ప సంప్రదాయాలను వదిలిపెట్టడం కాదని, వాటి ప్రేరణతో నేటి ప్రపంచంలో సువార్తను ప్రకటించే కొత్త మార్గాలను అన్వేషించడమేనని ఆయన వివరించారు.
ఆయన వ్యాఖ్యలు FABC ప్లీనరీ సమావేశంలో పదేపదే వినిపించిన ప్రధాన సందేశాన్ని ప్రతిబింబించాయి—సినడాలిటీ అంతిమంగా పరివర్తనకు పిలుపు. ఆలకింపు, సంభాషణ, సామూహిక ఆధ్యాత్మిక విచక్షణ ద్వారా పరిశుద్ధాత్మ స్వరాన్ని మరింత శ్రద్ధగా ఆలకిస్తూ, తన సేవకు నమ్మకంగా నిలవాలని అది శ్రీసభను ఆహ్వానిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా సినడాలిటీపై సినడ్ అమలు దశలోకి ప్రవేశిస్తున్న ఈ సమయంలో, గురుశ్రీ క్లారెన్స్ దేవదాస్ సందేశం ఒక ఆచరణాత్మక జ్ఞాపకాన్ని అందించింది. ఆసియాలో సినడాలిటీ భవిష్యత్తు కొత్త నిర్మాణాలపైనో, అదనపు కార్యక్రమాలపైనో ఆధారపడదు. స్థానిక శ్రీసభలు సినడాలిటీని సువార్తను జీవించే సాధారణ జీవన విధానంగా, సేవలో కలిసి పయనించే మార్గంగా స్వీకరిస్తాయా లేదా అన్నదే దాని విజయాన్ని నిర్ణయిస్తుంది.