ప్రజలు ఉన్న చోటే వారిని కలుసుకోండి: ఆసియా డిజిటల్ మిషనరీలకు వాటికన్ మీడియా నిపుణురాలి పిలుపు
కతోలిక డిజిటల్ మిషనరీలు ముందుగా ప్రజలను, వారి నిజ జీవిత అనుభవాలను అర్థం చేసుకోవాలని, వారికి ఏమి చెప్పాలి లేదా ఎలా సేవ చేయాలి అని నిర్ణయించుకునే ముందు వారి మాటలను ఆలకించాలని వాటికన్ కు చెందిన మీడియా అధికారి మిరాల్ అతిక్ అన్నారు.
జెరూసలేం లాటిన్ పాట్రియార్కేట్‌లోని జెరూసలేం మేత్రాసనం మీడియా అధికారిగా సేవలందిస్తున్న మిరాల్ అతిక్, సెప్టెంబర్ 11న క్వెజోన్ సిటీలో జరిగిన తొలి ఆసియా కతోలిక డిజిటల్ మిషనరీల సమ్మేళనంలోని “Understanding Asia Realities” ప్యానెల్ చర్చలో వ్యక్తిగత ప్రాముఖ్యతను వివరించారు.
సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు జరుగుతున్న ఈ సమ్మేళనంలో ఆసియా నలుమూలల నుంచి కతోలిక డిజిటల్ మిషనరీలు, సమాచార ప్రసారకులు, కంటెంట్ సృష్టికర్తలు పాల్గొని, వేగంగా మారుతున్న డిజిటల్ సంస్కృతిలో శ్రీసభ సువార్త ప్రచార మిషన్‌పై ఆత్మపరిశీలన చేస్తున్నారు.
“ప్రజలకు సేవ చేయడానికి ముందు వారి మాటలను ఆలకించడం, ప్రతి వ్యక్తి ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంటున్నారో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం” అని అతిక్ అన్నారు.
జోర్డాన్, పాలస్తీనా, ఇజ్రాయెల్, సైప్రస్‌లలోని కతోలిక సమాజాలకు జెరూసలేం మేత్రాసనం సేవలందిస్తున్న పవిత్ర భూమిలో ఈ విధానం మరింత ముఖ్యమని ఆమె తెలిపారు. విభిన్న భాషలు, సంస్కృతులు, సామాజిక వాస్తవికతలు ఉన్న ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణలు, ప్రజల బాధలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన జీవితానుభవాలను సృష్టించాయని వివరించారు.
“ఉత్తర ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల వాస్తవికతలు, వెస్ట్ బ్యాంక్‌లో నివసిస్తున్న వారి అనుభవాలకు భిన్నంగా ఉంటాయి. అలాగే గాజాలో నివసిస్తున్న ప్రజల వాస్తవికతలు కూడా పూర్తిగా భిన్నంగా ఉంటాయి” అని ఆమె అన్నారు.
ఈ భిన్నమైన పరిస్థితుల కారణంగా, ప్రజల వాస్తవికతలను ముందుగా అర్థం చేసుకోకుండా శ్రీసభ సమాచార ప్రసారకులు అందరికీ ఒకే సందేశంతో చేరుకోవడం సరికాదని అతిక్ పేర్కొన్నారు.
అందుకు బదులుగా, ముందుగా ప్రజలను ఆలకించాలని, వారు ఎదుర్కొంటున్న పరిస్థితులను తెలుసుకోవాలని, ఆ తరువాత వారి వాస్తవికతల మధ్యనే వారికి తోడుగా నడిచే మార్గాలను కనుగొనాలని ఆమె సూచించారు.
ఈ విధానాన్ని క్రీస్తు ప్రభువు సేవతో అనుసంధానించిన అతిక్, యేసు ప్రజలను వ్యక్తిగతంగా కలుసుకుని, వారి జీవిత పరిస్థితుల్లోనే వారికి స్పందించారని గుర్తుచేశారు.
“యేసు ప్రజలు ఎక్కడ ఉన్నారో అక్కడే వారిని కలుసుకున్నారు” అని అతిక్ అన్నారు.
ఒకే పోస్ట్, వీడియో లేదా సందేశం ద్వారా భౌగోళిక, సాంస్కృతిక సరిహద్దులను దాటి పెద్ద సంఖ్యలో ప్రజలను చేరుకోగల కతోలిక డిజిటల్ మిషనరీలకు ఈ సూత్రం ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉందని ఆమె పేర్కొన్నారు.
అయితే డిజిటల్ వేదికల ద్వారా విస్తృతంగా ప్రజలను చేరుకోగలగడం అంటే, తెరల వెనుక ఉన్న వ్యక్తులను అర్థం చేసుకోవాల్సిన అవసరం తగ్గిపోయిందని కాదని ఆమె స్పష్టం చేశారు.
అతిక్ దృష్టిలో సమాచార ప్రసారం వ్యక్తిగత కలయికతో ప్రారంభం కావాలి. డిజిటల్ కంటెంట్ నిజమైన వ్యక్తుల జీవితాలు, వారి అనుభవాలు, వారి ప్రశ్నలు, వారి నిరీక్షణల నుంచి రూపుదిద్దుకోవాలని ఆమె అన్నారు.
ఆమె స్వయంగా నిర్వహిస్తున్న మీడియా సేవ కూడా ఇదే విధానాన్ని ప్రతిబింబిస్తోంది. జెరూసలేం మేత్రాసనం మీడియా అధికారిగా జోర్డాన్, పాలస్తీనా, ఇజ్రాయెల్, సైప్రస్‌లలోని స్థానిక శ్రీసభ జీవితాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు పరిచయం చేస్తూ, ఆమె వార్తలు రాయడం, సంపాదించడం, మల్టీమీడియా కంటెంట్‌ను రూపొందించడం వంటి బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
ఘర్షణలతో ప్రభావితమైన ప్రాంతంలో పనిచేయడం సమాచార ప్రసార పరంగా ఎంతో సున్నితమైన సవాలని అతిక్ పేర్కొన్నారు. ప్రజల బాధలను, వారి చుట్టూ ఉన్న వాస్తవికతలను గుర్తిస్తూనే, కతోలిక సమాచార ప్రసారం కేవలం రాజకీయ అంశాలకే పరిమితం కాకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.
సువార్తను ఎవరికి ప్రకటిస్తున్నామో వారి జీవితాల నుంచి దానిని వేరుచేయలేమని, అదే సమయంలో సమాచార ప్రసారం శ్రీసభ మిషన్‌లో పాతుకుపోయి ఉండాలని ఆమె స్పష్టం చేశారు.
సాంస్కృతిక, మతపరమైన, సామాజిక వైవిధ్యాలతో కూడిన సమాజాల్లో సేవచేస్తున్న ఆసియా డిజిటల్ మిషనరీలకు అతిక్ అనుభవం ఒక ఆచరణాత్మక సూత్రాన్ని అందిస్తోంది: ప్రజలను శ్రీసభ ఉన్న చోటుకు రావాలని ఆహ్వానించే ముందు, వారు ఉన్న చోటే వారిని కలుసుకోవాలి.
డిజిటల్ వేదికలు శ్రీసభ మరింత విస్తృతంగా ప్రజలను చేరుకునేందుకు సహాయపడగలవు. అయితే అర్థవంతమైన సువార్త ప్రచారానికి ప్రతి వ్యక్తిపై శ్రద్ధ చూపడం, ఆయా సమాజాల వాస్తవికతలను అర్థం చేసుకోవడం అత్యవసరమని ఆమె తెలిపారు.
చివరగా, అతిక్ సందేశం కేవలం మెరుగైన డిజిటల్ కంటెంట్‌ను రూపొందించడం గురించి మాత్రమే కాదు. ముందుగా ఆలకించడం, ప్రజలను అర్థం చేసుకోవడం, వారి నిజ జీవిత వాస్తవికతల ఆధారంగా శ్రీసభ వారికి తోడుగా నడుస్తూ సమాచారాన్ని అందించడం అనే సువార్త ప్రచార దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నదే ఆమె ప్రధాన సందేశం.
