నిరీక్షణకు సాక్షులైన నేటి మగ్దల మరియలను గుర్తించాలి: కార్డినల్ టాగ్లే

కార్డినల్ టాగ్లే
2026 జూలై 22న జకార్తాలో జరిగిన FABC 12వ ప్లీనరీ సమావేశ ప్రతినిధుల కోసం నిర్వహించిన ఒకరోజు ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమం ముగింపుగా జరిగిన పవిత్ర దివ్యబలికి కార్డినల్ లూయిస్ ఆంటోనియో జి. టాగ్లే అధ్యక్షత వహించారు.

"మన విచారణల్లోను, మేత్రాసనాల్లోను ఎంతో మంది మగ్దల మరియలు ఉన్నారు. వారిని గుర్తించడం ఎంతో ముఖ్యం."

ఈ పిలుపుతో Federation of Asian Bishops' Conferences (FABC) 12వ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధుల కోసం నిర్వహించిన ఒకరోజు ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమాన్ని కార్డినల్ లూయిస్ ఆంటోనియో జి. టాగ్లే ముగించారు. ప్రపంచం విస్మరించిన వారినైనా, దేవుడు నిరీక్షణకు సాక్షులుగా ఎన్నుకున్న వ్యక్తులను ఆసియాలోని శ్రీసభ నాయకులు గుర్తించాలని ఆయన పిలుపునిచ్చారు.

జూలై 22న జకార్తాలోని హోటల్ ములియాలోని గెర్బెరా హాలులో కార్డినల్ టాగ్లే పవిత్ర దివ్యబలికి అధ్యక్షత వహించారు. ఈ దివ్యబలిపూజ మగ్దల మరియ పండుగను పురస్కరించుకుని జరగడమే కాకుండా, ప్లీనరీ సమావేశ ప్రతినిధుల కోసం నిర్వహించిన ప్రార్థన, మౌనం, ఆత్మపరిశీలన, ఆధ్యాత్మిక వివేచనతో కూడిన ఒకరోజు కార్యక్రమానికి ముగింపు పలికింది.

ఆరాధన ప్రారంభంలో కార్డినల్ టాగ్లే, ఆసియాలోని వివిధ దేశాల నుంచి వచ్చిన కార్డినల్స్, పీఠాధిపతులు, ప్రతినిధులకు పరిశుద్ధ లియో పాపు గారు ఆశీస్సులు, శుభాకాంక్షలను అందజేశారు.

శ్రీసభ "అపోస్తలులకు అపోస్తలురాలు"గా గౌరవించే పునీత మగ్దల మరియ జీవితాన్ని ప్రతిబింబిస్తూ, సమాజం బలహీనత లేదా అపజయంగా చూసే చోట దేవుడు గొప్పతనాన్ని చూస్తాడనే సత్యాన్ని ఆమె జీవితం వెల్లడిస్తుందని కార్డినల్ టాగ్లే అన్నారు.

"పునీత మగ్దల మరియ జీవితం ఎంతో అందమైనది. ఆమె ఎన్నో బాధలు అనుభవించింది. అయినప్పటికీ క్రీస్తు ప్రభువు ఆమెను చూసారు. ఆమెను పేరుపెట్టి పిలిచారు. గుర్తించారు తన ప్రేమతో ఆమెలో పరివర్తన తెచ్చారు," అని ఆయన అన్నారు.

ఏడు దయ్యాలు వెళ్లగొట్టబడిన స్త్రీగా పేరుపొందిన మగ్దల మరియ, తరువాత క్రీస్తు ప్రభువుకు అత్యంత సన్నిహిత శిష్యురాలిగా మారిందని, అనేక మంది పారిపోయిన సమయంలో కూడా సిలువ పాదాల వద్ద చివరి వరకు విశ్వాసపాత్రంగా నిలిచిందని కార్డినల్ టాగ్లే గుర్తుచేశారు.

"ఆ మహిళలు అక్కడ నిలబడి ప్రపంచానికి ఇలా ప్రకటించినట్లున్నారు: 'ఆయన ఎవరో మాకు తెలుసు. ఆయనను మేము నిరాకరించలేము. మా అంకితభావం ఏమాత్రం తగ్గదు,'" అని ఆయన అన్నారు.

ఖాళీ సమాధి వద్ద పునరుత్థాన ప్రభువును కలుసుకున్న మగ్దల మరియ అనుభవాన్ని కూడా కార్డినల్ టాగ్లే ప్రతిబింబించారు. దుఃఖంతో నిండిపోయిన ఆమె మొదట పునరుత్థాన ప్రభువును గుర్తించలేకపోయినా, ఆయన ఆమెను పేరుపెట్టి పిలిచిన క్షణంలో అంతా మారిపోయిందని ఆయన చెప్పారు.

"ఒక చిన్న చర్య ఆమెకు అత్యంత గొప్ప సంఘటనను దర్శింపజేసింది. ఆమె తన కాపరి స్వరాన్ని విన్నది. తనను తెలిసిన ప్రభువును గుర్తించింది," అని ఆయన అన్నారు.

ఈ సంఘటన విశ్వాసం అనేది మానవ ప్రయత్నంతో కాకుండా, దేవుని చొరవతో ప్రారంభమవుతుందని తెలియజేస్తుందని కార్డినల్ టాగ్లే వివరించారు. మగ్దల మరియ ముందుగా ప్రభువు ప్రేమను అనుభవించినందువల్లే, ఆయన స్వరాన్ని గుర్తించి పునరుత్థాన ప్రభువును తెలుసుకోగలిగిందని ఆయన చెప్పారు.

ఆ అనుభవం వెంటనే ఒక సేవా బాధ్యతగా మారింది. యేసు తన పునరుత్థాన వార్తను అపోస్తలులకు ప్రకటించే బాధ్యతను మగ్దల మరియకు అప్పగించారని, ఈ విధంగా క్రైస్తవ విశ్వాసంలోని అత్యంత ప్రధాన సందేశానికి తొలి సాక్షిగా ఆమె నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

"ఆమె ఇతర శిష్యులకు వారధిగా నిలిచింది. ఆమె సందేశం ఎంతో సరళమైనది— 'నేను ప్రభువును చూశాను.' అది తాను స్వయంగా అనుభవించిన విషయానికి సంబంధించిన వ్యక్తిగత సాక్ష్యం," అని కార్డినల్ టాగ్లే అన్నారు.

ఆ కాలపు సామాజిక ప్రమాణాల ప్రకారం విశ్వసనీయ సాక్షిగా భావించబడని వ్యక్తికే యేసు తన పునరుత్థాన ప్రకటన బాధ్యతను అప్పగించడం ఉద్దేశపూర్వకమేనని ఆయన వివరించారు.

"ప్రపంచం సులభంగా అంగీకరించని వ్యక్తుల ద్వారానే పునరుత్థాన ప్రభువు అత్యంత గొప్ప సువార్తను ప్రకటింపజేశారు. ప్రపంచం ప్రాముఖ్యతను అంచనా వేసే విధానం ఇది కాదు; దేవుడు చూసే విధానం ఇది," అని ఆయన అన్నారు.

సేవా కార్యానికి, ఐక్యతకు వారధులుగా మారాలనే ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమ ప్రధానాంశాన్ని మరోసారి ప్రస్తావిస్తూ, తమ తమ స్థానిక శ్రీసభల్లోనూ ఇలాంటి నిరీక్షణ సాక్షులను గుర్తించాలని కార్డినల్ టాగ్లే ప్రతినిధులను ప్రోత్సహించారు.

"మన విచారణల్లోను, మేత్రాసనాల్లోను ఎంతో మంది మగ్దల మరియలు ఉన్నారు. వారిని గుర్తించడం ఎంతో ముఖ్యం. వారు మనకు ప్రభువు పంపిన సాక్షులు. నిరీక్షణ నెరవేర్పును, అత్యున్నత సత్యాన్ని వారు మనకు గుర్తుచేస్తున్నారు— క్రీస్తు ప్రభువు నిజంగా పునరుత్థానమయ్యారు," అని ఆయన అన్నారు.

ఈ పవిత్ర దివ్యబలిపూజతో FABC ప్లీనరీ సమావేశ ప్రతినిధుల కోసం నిర్వహించిన ఒకరోజు ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమం ముగిసింది.