పాదువాపురి పునీత అంతోని గారి మహోత్సవము
పాదువాపురి పునీత అంతోని గారి మహోత్సవము
పునీత అంతోనివారు క్రీ.శ. 1195 ఆగుష్టు 15న, స్పెయిను దేశములోని లిస్బన్ నగరంలో, మార్టిన్, తెరెసా దంపతులకు జన్మించారు. దేవలయంనందు జ్ఞానస్నానము పొంది “ఫెర్నాండో” అనే పేరుతో నామకరణం చేయబడ్డారు.
చిన్ననాటి నుండే క్రైస్తవ విశ్వాసములో, దేవుని యందు భయభక్తులతో పెరిగారు . గురువు కావాలి అనే కోరికతో ఫెర్నాండో 15 సం.ల వయస్సులో పు. అగుస్తీనువారి మఠములో చేరారు. మఠములో సుమారు 9సం.ల పాటు పవిత్రమైన ప్రార్ధనా జీవితం, దైవశాస్త్ర అధ్యయనం ద్వారా వేదపండితుడు అయ్యారు.
ఫెర్నాండోకు 25 సం.ల వయస్సు ఉన్నప్పుడు, ఒక సంఘటన తన జీవితాన్నే మార్చివేసింది. అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారి సభకు చెందిన ఐదుగురు సహోదరులు మొరాకోలో జరిగిన వేదహి౦సలలో చంపబడ్డారు. ముక్కలుగావున్న వారి దేహాలను శవపేటికలో చూచిన తర్వాత, ఫెర్నాండో చలించి తానుకూడా వేదప్రచారకుడిగా, వేదసాక్షి మరణాన్ని పొందాలని, క్రీస్తు కొరకు తన ప్రాణాలను అర్పించాలనే కోరిక తనలో దహించి వేయగా, పునీత ఆగస్తీను వారి మఠాన్ని విడచి, ఫ్రాన్సిస్ వారి సభలో చేరాడు. 1221 సం.లో ఫ్రాన్సిస్ సభ అంగీని ధరించి, తన పేరును ‘అంతోని’గా మార్చుకున్నారు.
పునీత అంతోని వారు దేవున్ని అమితముగా ప్రేమించారు. అవిశ్రాంతముగా సువార్తా సత్యాన్ని ప్రకటించారు. పని, చదువు, బోధనల కన్న, 'ప్రార్ధన, భక్తి కార్యక్రమాలకు ప్రాముఖ్యతను ఇచ్చేవారు. అసత్యములో జీవించేవారిని సత్యములోనికి నడిపించారు.
పునీత అంతోని వారు చేపలకు సువార్తను బోధించడం, గాడిద దివ్యసత్ప్రసాదమును మొకాలూని ఆరాధించడం, కుంభ వర్షాన్ని ఆపడం వంటి ఎన్నో అద్భుతాలను చేసారు. క్రీస్తు సువార్తకు అద్భుతమైన, శక్తివంతమైన సాక్షిగా మారాడు. కేవలం బోధించడమే కాకుండా, బోధించిన దానిని తన అనుదిన జీవితములో పాటిస్తూ అందరికి ఆదర్శముగా ఉన్నారు.
- From Fr. Praveen Gopu's Homilies and Reflections
Article by
M.kranthi swaroop
RVA Telugu online producer