విభజిత ప్రపంచంలో వారధులు నిర్మించనున్న ఆసియా శ్రీసభ

ఆసియా కతోలిక పీఠాధిపతుల సమాఖ్య (FABC) వార్షిక సమావేశం, శ్రీసభ నాయకులకు ఒక కీలక పిలుపునిస్తూ ప్రారంభమైంది. కేవలం శ్రీసభకే పరిమితం కాకుండా, సినడాలిటీ స్ఫూర్తిని ఆసియా అంతటా కార్యరూపంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందని ఈ సమావేశం స్పష్టం చేసింది.

ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి, ఆసియాలోని 20కు పైగా దేశాలు, ప్రాంతాల నుంచి 100 మందికి పైగా పీఠాధిపతులు సమావేశమై, తమ ప్రాంతాలలో ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లపై చర్చిస్తారు.

ఈ సమావేశ నిర్వహణ కమిటీ సభ్యుడు గురుశ్రీ NIKASIUS JATMIKO మాట్లాడుతూ, ఈ ఏడాది సమావేశం ప్రధానంగా "సంభాషణ ద్వారా వారధులను నిర్మించడం, అలాగే ఆసియా అంతటా శాంతిని పెంపొందించడం"పై దృష్టి సారించిందని తెలిపారు.

"సంభాషణ ఎంతో ముఖ్యమైనది. ఎలాంటి సమస్యలు ఎదురైనా, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమే పరిష్కారానికి మొదటి అడుగు. సమస్యను ఒక్క వ్యక్తి పరిష్కరించలేడు. అందరం కలిసి చర్చించి, పరస్పర అవగాహనతో ముందుకు సాగితేనే శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుంది." అని ఫాదర్ NIKASIUS JATMIKO అన్నారు 

ఆసియా శ్రీసభ ప్రత్యేకంగా సంభాషణకు ఎప్పటినుంచో ప్రాధాన్యతను ఇస్తుంది.

1990లో ఇండోనేషియాలోని Bandungలో జరిగిన FABC మహాసభలో "త్రైపాక్షిక వార్తలాపం" అనే భావన రూపుదిద్దుకుంది. 

ఈ విధానం ప్రకారం శ్రీసభ పేదలతో, స్థానిక సంస్కృతులతో, అలాగే ఇతర మతాల ప్రజలతో నిరంతర సంభాషణ కొనసాగించాల్సిన అవసరాన్ని వివరించింది.

ఈ సమావేశం ముగింపులో ఆగ్నేయాసియాలోనే అతిపెద్ద మసీదైన ఇస్తిక్లాల్ మసీదు నుంచి జకార్తా కథడ్రల్ వరకు నిర్మించిన భూగర్భ మార్గంలో వీరు కాలినడకన వెళ్లారు

ఈ మార్గం ఇండోనేషియాలో నెలకొన్న మతసామరస్యం, పరస్పర గౌరవం, సహనానికి ప్రతీకగా నిలుస్తుందని గురుశ్రీ NIKASIUS తెలిపారు.

ఆసియా ఖండంలో కతోలికులు మొత్తం జనాభాలో కేవలం మూడు శాతం మాత్రమే ఉన్నప్పటికీ, విద్య, ఆరోగ్య సేవలు, సామాజిక సేవల రంగాల్లో ఇతర మతాల ప్రజలతో కలిసి పనిచేస్తూ, సంభాషణను ఆచరణాత్మక సహకారంగా మార్చేందుకు శ్రీసభ నిరంతరం కృషి చేస్తోంది.

విభిన్న సంస్కృతులు, మతాలు, సంప్రదాయాలతో కూడిన ఆసియాలో శాంతి, ఐక్యత, పరస్పర గౌరవం కోసం వారధులు నిర్మించడమే... ఈ సమావేశం ప్రధాన సందేశంగా నిలిచింది.