పర్యావరణ పరిరక్షణను అలవర్చుకోవాలని ముంబై కుటుంబాలకు పిలుపు
భారతదేశ పశ్చిమ ప్రాంతంలోని ముంబై శివారు ప్రాంతమైన వాకోలాలోని సెయింట్ ఆంథోనీ విచారణలో, ఫ్రాన్సిస్ పరిశుద్ధ పాపు గారి బోధనల ఆధారంగా నిర్వహించిన 'సగ్ర పర్యావరణ పరిరక్షణ' (Integral Ecology) అవగాహన సదస్సులో సృష్టి సంరక్షణను జీవనశైలిగా మార్చుకోవాలని కుటుంబాలకు పిలుపునిచ్చారు.
బొంబాయి అగ్రమేత్రాసన పర్యావరణ విభాగం సహకారంతో శ్రీసభకు చెందిన 'ఫ్యామిలీ సెల్' ఆగస్టు 1న "కుటుంబ జీవితంలో సమగ్ర పర్యావరణ పరిరక్షణ" అనే అంశంపై ఈ సదస్సును నిర్వహించింది. 'లౌదాతో సీ', 'ఫ్రతేల్లి తూత్తి', 'అమోరిస్ లెతీషియా', మరియు 'గౌదేతే ఎత్ ఎక్సుల్తా తే' వంటి కీలకమైన శ్రీసభ పత్రాల ద్వారా పర్యావరణ పరిరక్షణపై పరిశుద్ధ పాపు గారు చూపిన మార్గాన్ని డీకన్ జైమ్ మరియు శ్రీమతి లిగియా ఫోన్సెకా వివరించారు.
హాజరైన వారికి స్వాగతం పలుకుతూ, ఫ్యామిలీ సెల్ ఆధ్యాత్మిక దర్శకులు గురుశ్రీ రయాన్ అలెక్స్ వక్తలను పరిచయం చేశారు. క్రైస్తవ కుటుంబ జీవితంలో సృష్టి సంరక్షణను ఒక భాగంగా మార్చుకోవాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు.
పరిశుద్ధ పాపు గారు పేర్కొన్న "భూమాత ఆక్రందన"కు కుటుంబాలు ఏ విధంగా స్పందించాలో క్రీయాశీల మార్గాలను ఈ సదస్సులో వివరించారు. ప్లాస్టిక్, ఒకసారి వాడి పడేసే వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని, చెత్తను సరైన రీతిలో వేరు చేయాలని, రీసైక్లింగ్ మరియు కంపోస్టింగ్‌ను ప్రోత్సహించాలని, పర్యావరణహిత ఉత్పత్తులనే ఎంచుకోవాలని వక్తలు కోరారు.
అవసరం లేని వినియోగాన్ని, అనవసర వ్యయాలను నివారించాలని సూచిస్తూ... బాధ్యతాయుతమైన సంరక్షణ అనేది ఇంట్లో తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలతోనే ప్రారంభమవుతుందని గుర్తుచేశారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో, తమ కుటుంబాలు మరియు సమాజంలో పర్యావరణహిత పద్ధతులను ప్రేరేపించడంలో యువత క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
వ్యక్తిగత చర్యలు చిన్నవిగా అనిపించినప్పటికీ, సామూహిక ప్రయత్నాలు పర్యావరణంలో గొప్ప మార్పును తీసుకురాగలవని వక్తలు తెలిపారు.
ఫ్యామిలీ సెల్ సభ్యులతో సహా సుమారు 27 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొన్నవారు తమ అనుభవాలను పంచుకోవడానికి, పర్యావరణహిత జీవితంపై ప్రశ్నలు అడగడానికి ఒక ఓపెన్ డిస్కషన్ అవకాశం కల్పించింది.
ఈ సదస్సు ఎంతో సమాచారంతో కూడుకుని, స్ఫూర్తిదాయకంగా ఉందని పాల్గొన్నవారు తెలిపారు. దేవుని సృష్టిని కాపాడుకోవాలనే బైబిల్ సందేశాన్ని పర్యావరణ బాధ్యతతో అనుసంధానించడానికి మరియు తమ విశ్వాసాన్ని ఆచరణలో పెట్టడానికి ఇది దోహదపడిందని పేర్కొన్నారు.
అద్భుతమైన ప్రసంగాన్ని అందించిన వక్తలకు ఫ్యామిలీ సెల్ ధన్యవాదాలు తెలిపింది. అలాగే ఈ కార్యక్రమ నిర్వహణకు మార్గదర్శకత్వం, మద్దతు అందించిన విచారణ గురువులు గురుశ్రీ ఫ్రాన్సిస్ కార్వాల్హో మరియు గురుశ్రీ రయాన్ అలెక్స్‌లకు కృతజ్ఞతలు తెలియజేసింది. సృష్టి సంరక్షణ ద్వారా కుటుంబాలు సువార్తను ఆచరించేలా ప్రోత్సహించే ఇటువంటి విశ్వాస వికాస కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.
