ఢిల్లీని కమ్మేసిన వాయు కాలుష్యం
ఢిల్లీని కమ్మేసిన వాయు కాలుష్యం
దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం వణికిస్తోంది. వాయు నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దమ్ము, ధూళి కణాలతో గాలి నిండిపోయింది. విజబులిటీ 500 మీటర్లకు పడిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై గాలి నాణ్యత 450పైగా నమోదు అవుతోంది.
వ్యర్థాల దహనం, వాహనాల కాలుష్యం, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ఢిల్లీ ఎన్సీఈర్ పరిధిలో వాయు కాలుష్యం పెరిగిపోతోంది. కాలుష్యం ప్రభావంతో కళ్ల మంటలు, కంటి నుంచి నీరు కారడం, గొంతు నొప్పి, దగ్గుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శ్వాసకోశ తీసుకోవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాలుష్య ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుందని భావించి ముందుగానే విద్యా సంస్థలకు శీతాకాలపు సెలవులు ప్రకటించింది. గతవారం నుంచి ప్రాథమిక పాఠశాలలను మూసివేసిన విషయం తెలిసిందే. నవంబరు 10 వరకూ ప్రకటించిన సెలవులను పొడిగించింది. అన్ని విద్యా సంస్థలను నవంబరు 9 నుంచి 18 వరకూ మూసివేస్తున్నట్టు బుధవారం వెల్లడించింది. వీటిని వింటర్ వెకేషన్‌గా పేర్కొంది.
వాయు కాలుష్యం అంతకంతకూ పెరుగుతుండటంతో జీఆర్ఈపీ 3 నిబంధనలను అమలులోకి తెచ్చారు. డీఎస్3 పెట్రోల్, డీఎస్4 డీజిల్ వాహనాల రాకపోకలపై నిషేధాలు విధించారు. ఢిల్లీలో 13 హాట్ స్పాట్ లను గుర్తించి నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు.ఢిల్లీతోపాటు పొరుగున ఉన్న హరియాణా, పంజాబ్, రాజస్థాన్, యూపీలోనూ వాయు కాలుష్యం తీవ్రంగా ఉంది.