హీట్‌వేవ్ - సహాయక చర్యల్లో జైపూర్ మేత్రాసనం

 హీట్‌వేవ్ - సహాయక చర్యల్లో జైపూర్ మేత్రాసనం

 తీవ్రమైన హీట్‌వేవ్ పరిస్థితులలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు ఉపశమనం అందించడంలో ప్రభుత్వ ఏజెన్సీలతో కలసి  జైపూర్ మేత్రాసనం సహాయం అందిస్తుంది.

అత్యంత వేడి వాతావరణం కారణంగా రాజస్థాన్ రాష్ట్రంలో 122 మంది మరణించారని స్థానిక మీడియా నివేదించింది, వాటిలో దాదాపు సగం మరణాలు మే 23 మరియు మే 30 మధ్య సంభవించాయి.

దేశంలోని వాయువ్య మరియు మధ్య ప్రాంతాలైన  రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ మరియు మధ్యప్రదేశ్‌లకు మే 30న భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.  వాతావరణం  అత్యంత వేడిగా ఉంటుందని, ప్రజలను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తగిన నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

రాజస్థాన్‌లోని చురు పట్టణం మరియు పొరుగున ఉన్న హర్యానాలోని సిర్సా పట్టణంలో
 50 డిగ్రీల సెల్సియస్ (122 డిగ్రీల ఫారెన్‌హీట్)ను అధిగమించింది.దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఒక ప్రాంతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతను 52.9 డిగ్రీల సెల్సియస్ ను నమోదు చేసింది.

రాజస్థాన్‌లోని జైపూర్ డియోసెస్‌కు చెందిన విశ్రాంత పీఠాధిపతులు మహాపూజ్య ఎమిరిటస్ ఓస్వాల్డ్ జోసెఫ్ లూయిస్ గారు  మాట్లాడుతూ, “తీవ్రమైన వాతావరణ పరిస్థితులలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని తెలుసుకోవడం చాలా బాధ కలిగించింది అని,
 మేత్రాసన సామాజిక సేవా విభాగంలో వాలంటీర్లు మరియు విశ్వాసులు  ప్రజలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు అని, వాతావరణ పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇంటింటికి తిరుగుతూ, తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ, మందులు ఇస్తున్నారని పీఠాధిపతి తెలిపారు.

ఎండలో పని చేసే రోజువారీ కూలీ కార్మికులలో అత్యధిక మరణాలు నమోదయ్యాయి అని, రోజువారీ పనిచేసే వారికీ  "మా వాలంటీర్లు వారికి ఉచిత భోజనం మరియు నీటిని అందిస్తున్నారు" అని లూయిస్ గారు తెలిపారు.

మరియు ఈ పరిస్థితిని ఎదుర్కోవటానికి ప్రభుత్వ సంస్థలకు సహాయం చేయడానికి తమ చిన్న ప్రయత్నమని పీఠాధిపతి అన్నారు.

దేశ రాజధానిలోని క్రైస్తవ దేవాలయాల  వెలుపల తాగునీటికి ఏర్పాట్లు చేసినట్లు ఢిల్లీ ఆర్చ్‌డియోసెస్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శశి ధరన్ తెలిపారు. వేడిగాలుల దృష్ట్యా ఉదయం 6.30 గంటలకే ప్రార్థనలు, సాయంత్రం 7గంటలకు ఇతర దేవాలయ సంబంధిత సేవలు నిర్వహిస్తున్నట్లు అలహాబాద్ డయాసిస్ గురుశ్రీ  రెజినాల్డ్ డిసౌజా గారు తెలిపారు.

మరోవైపు వడదెబ్బ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించాలని రాజస్థాన్ హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

ప్రపంచం అంతా ఎండలు పెరిగిపోవడానికి ప్రధాన కారణం భూతాపమే. పెరిగిన భూతాపం, వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు మాడిపోతున్నాయి మరియు అనేక ఇతర ప్రకృతి విపత్తులకు కూడా కారణం అవుతున్నాయి.

 

 


Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer